విరాట్ కోహ్లీతో గొడవల గురించి స్పందించిన అశ్విన్... భలే ఫన్నీగా ఉందంటూ...

First Published Sep 30, 2021, 3:57 PM IST

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రవిచంద్రన్ అశ్విన్ పేరు మార్మొగిపోతోంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్‌తో జరిగిన మాటల యుద్ధం ఓ కారణమైతే, ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ ప్రవర్తనపై అశ్విన్, బీసీసీఐకి ఫిర్యాదు చేశాడనేది మరో వార్త...

ఇంగ్లాండ్ టూర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి మొదటి నాలుగు టెస్టుల్లోనూ చోటు దక్కకపోవడం ఆ సమయంలో హాట్ టాపిక్ అయ్యింది... ఆ సమయంలోనే భారత సారథి విరాట్ కోహ్లీకి, రవిచంద్రన్ అశ్విన్‌కి గొడవైందని కొన్ని వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరి మధ్య వైరం పెరిగిపోయిందంటూ వార్తలు కూడా అల్లేశారు... 

ఆఫ్ ఫీల్డ్ ఎంతో వినయంగా నడుచుకుంటూ, ఫన్నీగా అందరితో కలిసిపోయి నవ్వుతూ నవ్వించే విరాట్ కోహ్లీ... ఆన్ ది ఫీల్డ్ మాత్రం చాలా అగ్రెసివ్... ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేశారని అనుకుంటే సొంత జట్టు ప్లేయర్లపై కూడా నోరుపారేసుకుంటూ ఉంటాడు కోహ్లీ... ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం ఆట వరకూ మాత్రమే పరిమితం...

అయితే గత ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ ప్రవర్తన బాగోలేదని ఓ సీనియర్ ప్లేయర్, బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను మరెవ్వరో కాదని, రవిచంద్రన్ అశ్విన్ అని వార్తలు షికార్లు చేశాయి....

ఇంగ్లాండ్ టూర్‌లో న్యూజిలాండ్‌తో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా, ఆ తర్వాత నెలన్నర గ్యాప్ తీసుకుని ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టులు ఆడింది... ఐదో టెస్టు ఆరంభానికి ముందు భారత బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో మాంచెస్టర్ టెస్టును అర్ధాంతరంగా రద్దు చేసుకున్న ప్లేయర్లు, ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకున్నారు...

అయితే ఇంగ్లాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ తనతో ప్రవర్తించిన విధానం సరిగా లేదని, భారత జట్టుకి ఎన్నో మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్ అని కూడా చూడకుండా తనను అవమానించాడంటూ బీసీసీఐకి అశ్విన్ ఫిర్యాదు చేసినట్టు వార్తుల వచ్చాయి...

ఆ తర్వాత కొద్దిసేపటికే రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా కూడా విరాట్ కోహ్లీ గురించి బీసీసీఐ సెక్రటరీ జే షాకి ఫిర్యాదు చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి...

విరాట్ కోహ్లీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తుండడంతో వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ముందుకు కదిలింది బీసీసీఐ. భారత క్రికెట్ బోర్డు అధికారులు, కోహ్లీకి వ్యతిరేకంగా ఫిర్యాదులు వచ్చాయనేది ఉట్టి పుకారే అంటూ కొట్టిపారేశారు...

ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ పుకార్లపై స్పందించాడు... ‘ఈ ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నది ఎవరో తెలుసుకోవాలని వెతుకుతూ ఉన్నా. చాలా ఫన్నీగా ఉంటున్నాయి. కొందరైతే ఎవరో మీడియా ప్రతినిథి చెప్పారని, మరికొందరైతే ఇంకోకరి పేరుతో కొత్త కొత్త కొటేషన్లు అల్లేస్తున్నారు...’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేశాడు రవిచంద్రన్ అశ్విన్..

click me!