IPL 2021 CSK vs SRH: పైన వాళ్లు.. కింద వీళ్లు.. తమిళ తంబీలకు షాకిస్తామంటున్న కేన్ మామ

First Published Sep 30, 2021, 1:45 PM IST

IPL 2021 CSK vs SRH: ఐపీఎల్ 14వ సీజన్ లో గురువారం మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) ..  అదే జాబితాలో అట్టడుగున ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ (sun risers hyderabad) తో నేటి సాయంత్రం జరుగనున్న మ్యాచ్ లో తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ (play off) అవకాశం దూరమవడంతో మిగిలిన జట్లకు షాకివ్వడానికి ఆరెంజ్ ఆర్మీ సిద్ధంగా ఉంది. 

ఐపీఎల్ రెండో అంచెలో భాగంగా  నేటి సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ ల మధ్య పోరు జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న చెన్నై.. దానిని నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. ఆఖరున ఉన్న సన్ రైజర్స్  తక్కిన మ్యాచ్ లైనా గెలిచి చెన్నైకి షాక్ ఇవ్వాలని చూస్తున్నది. 

ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి వైదొలిగిన  సన్ రైజర్స్ హైదరాబాద్.. గత మ్యాచ్ లో రాజస్థాన్ ను చిత్తుగా ఓడించి పరాజయాల పరంపరకు ముగింపు పలికి జోష్ మీదుంది. మరోవైపు వరుసగా మూడు మ్యాచ్ లలో నెగ్గిన చెన్నై కూడా అంతే జోరు మీద కనిపిస్తుంది. 

ప్లే ఆఫ్, నెట్ రన్ రేట్ వంటి గోల ఏమీ లేకపోవడంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్సే స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ‘మేము వదులుకోబోము’ అని ఇప్పటికే ప్రకటించేశాడు.

గత మ్యాచ్ లోనే రైజర్స్ పలు మార్పులతో అదరగొట్టింది. నేటి మ్యాచ్ లో కూడా అదే టీమ్ తో ఆడాలని భావిస్తున్నది. ఓపెనర్ జేసన్ రాయ్ వీరవిహారం చేయడం.. కేన్ విలియమ్సన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా కూడా టచ్ లోకి రావడంతో పాటు ఆఖర్లో వచ్చే  హోల్డర్ కూడా బ్యాటింగ్ చేస్తుండటం రైజర్స్ కుకలిసొచ్చే అంశం. 

అయితే మిడిలార్డర్ మరింతగా రెచ్చిపోతే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్ లో భువనేశ్వర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను కట్టడి చేస్తున్నారు. ఇక గత మ్యాచ్ లో బరిలోకి దిగని వార్నర్ భాయ్.. ఈ మ్యాచ్ లో కూడా ఆడేది డౌటే. రైజర్స్ కు వార్నర్ దూరమవుతున్నాడని ఒకవైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో జట్టు యాజమాన్యం వార్నర్ భవితవ్యాన్ని ఎటు తేల్చలేకపోతున్నది.
 

ఇక చెన్నై విషయానికొస్తే.. ఆ జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ బ్యాటింగ్ లో అదరగొడుతున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనాలతో పాటు కెప్టెన్ ధోని కూడా ఐపీఎల్ రెండో ఫేజ్ లో పెద్దగా ప్రభావం చూపలేదు.

మిడిలార్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇది ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తున్నది. గత మ్యాచ్ లో రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్ తో చెన్నైని గెలుపు బాట పట్టించాడు. బౌలింగ్ లో దీపక్ చాహర్, బ్రావో, హెజిల్వుడ్  ఆదిలో వికెట్లు తీసినా తర్వాత చేతులెత్తేస్తున్నారు. 

ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఉన్నా ఇంతవరకు పెద్దగా రాణించింది లేదు.  కాగా, గత మ్యాచ్ లో బ్రావో కు గాయం కావడంతో అతడికి బదులు సామ్ కరన్ ను ఆడించినా అతడు ప్రభావం చూపలేదు. 

ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇరు జట్లు 15 సార్లు తలపడగా.. అందులో 11 సార్లు చెన్నై గెలిచింది. నాలుగు సార్లు రైజర్స్  విజయం సాధించింది.  ప్రస్తుత సీజన్ లో భాగంగా ఢిల్లీలో ఇరు జట్లు తలపడగా అందులో ఏడు వికెట్ల తేడాతో చెన్నై నెగ్గింది.  

జట్లు (అంచనా) : చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, హెజిల్వుడ్

సన్ రైజర్స్ హైదరాబాద్ : జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ

click me!