
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్2025) రాబోయే సీజన్ కోసం అన్ని జట్లు సన్నద్దం అవుతున్నాయి. మెగా వేలం కోసం ఫ్రాంఛైజీలు తమ జట్లలోకి ప్లేయర్లను తీసుకునే విషయంలో వ్యూహాలు రచిస్తున్నాయి. కాగా, ఐపీఎల్ 2025 లో టీ20 క్రికెట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న పలువురు లెజెండరీ ప్లేయర్లు కూడా ఆడనున్నారు. వారిలో టాప్-6 ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎంఎస్ ధోని
భారత జట్టును మూడు ఫార్మాట్లలలో నెంబర్ వన్ గా నిలబెట్టిన లెజెండరీ కెప్టెన్ ధోని. ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్‌గా ఆ జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ధోని మరో మూడునాలుగు సంవత్సరాలు చెన్నై టీమ్ కోసం ఆడతాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2025 లో కూడా ధోని చెన్నై ప్లేయర్ గా జట్టులో ఉంటాడని క్రికెట్ వర్గాల టాక్.
రోహిత్ శర్మ
భారత ఛాంపియన్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ సమయంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక ఐపీఎల్ లో తిరుగులేని కెప్టెన్ గా నిలిచాడు. ఐదు సార్లు ముంబై జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఛాంపియన్ గా నిలిచింది.
విరాట్ కోహ్లీ
రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, 2024 ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా టీ20 క్రికెట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్న సమయంలో కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఐపీఎల్ తన జట్టును ఎన్నడూ మార్చని ఏకైక ఆటగాడు. ఆర్సీబీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు.
ట్రెంట్ బౌల్ట్
అంతర్జాతీయ క్రికెట్ లో లెజెండరీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్. న్యూజిలాండ్‌కు కీలక ఆటగాడిగా ఉన్న ఈ స్టార్ బౌలర్ టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఐపీఎల్ 2024లో బౌల్ట్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. ఏ జట్టుకు ఆడినా అతను ఆ టీమ్ లో అత్యధిక వికెట్లు తీసుకునే ప్లేయర్ గా నిలిచే బౌలర్. రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా ఆడనున్నాడు.
డేవిడ్ వార్నర్
అంతర్జాతీయ క్రికెట్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు డేవిడ్ వార్నర్. ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ లో అనేక రికార్డులు సృష్టించాడు. వార్నర్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ 2016 టైటిల్ ను గెలుచుకుంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా డేవిడ్ భాయ్ ఆడనున్నాడు.
రవీంద్ర జడేజా
భారత స్టార్ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకరు. భారత్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలుచుకున్న తర్వాత జడేజా ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. జడేజా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడాడు. రెండు జట్లలో అతను ట్రోఫీ గెలిచిన టీమ్స్ లో ఉన్నాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో అదరగొట్టే జడేజా.. హర్షల్ పటేల్ (ఆర్సీబీ) వేసిన ఒక ఓవర్‌లో ఏకంగా 37 పరుగులు చేసి ఐపీఎల్ రికార్డు సృష్టించాడు.