IPL 2025-Rohit Sharma: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్జీ) భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ జహీర్ ఖాన్‌ను తమ జట్టు కొత్త మెంటార్‌గా నియమించినట్లు ఆ టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా తెలిపారు. ఈ నిర్ణయం ఇప్పుడు రాబోయే ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం లక్నో టీమ్ వ్యూహం, ఉన్నత స్థాయి ఆటగాళ్ల భవిష్యత్తు గురించి ఊహాగానాలను మరింత పెంచింది.
ఇదే సమయంలో కేఎల్ రాహుల్ ను జట్టులో ఉంచుకుంటారా? లేదా? జట్టులో ఉంటే ప్లేయర్ గా ఉంటాడా? లేక కెప్టెన్ గా కొనసాగుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే క్రమంలో లక్నో టీమ్ కు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేమిటంటే.. భారత ఛాంపియన్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎల్ఎస్జీ టీమ్ దక్కించుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటోందనీ, రాబోయే మెగా వేలంలంలో రోహిత్ శర్మను దక్కించుకోవడానికి ఏకంగా రూ.50 కోట్లను తన పర్సులో ఉంచుకోనుందని వార్తలు వస్తున్నాయి.
లక్నో జట్టు కేవలం ఒక్క ప్లేయర్ కోసం ఏకంగా రూ.50 కోట్లను వేరుగా పెట్టారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబై జట్టులో ఉన్నాడు. అతని కోసం చాలా ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. అయితే, ముంబై టీమ్ రోహిత్ శర్మను ఇంకా వదిలిపెట్టలేదు. గత సీజన్ లో కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన ముంబై టీమ్ రోహిత్ ను రిటైన్ చేసుకుంటుందా? లేదా వదులుకుంటుందా? అనే విషయంపై ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
లక్నో టీమ్ రోహిత్ శర్మను తమ జట్టు కెప్టెన్ గా చేయాలని చూస్తోందని వస్తున్న వార్తలపై ఆ టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా తాజాగా స్పందించారు. రోహిత్ శర్మను దక్కించుకోవడం కోసం ఎల్ఎస్జీ 50 కోట్ల రూపాయలను రిజర్వ్ చేసిందని వార్తలపై ఆయన స్పందిస్తూ పుకార్లుగా కొట్టిపారేశారు. సంజీవ్ గోయెంకా ఈ ఆలోచనను నిరాధారమైనదిగా, ఇది ఆచరణాత్మకం కాదని కొట్టిపారేశారు.
Rohit to Rishabh
"రోహిత్ శర్మ వేలంలోకి ప్రవేశిస్తున్నాడో లేదో కూడా తెలియదు. మీకు తెలుసా? ఇదంతా అనవసర చర్చ.. ఇదంతా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను విడుదల చేస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రోహిత్ వేలానికి వచ్చినా.. మీ పర్సులో 50 శాతం ఒక్క ప్లేయర్ పై పెడితే మిగతా ప్లేయర్లను ఎలా కొనుగోలు చేస్తారు?" అని గోయెంకా చిరు నవ్వుతో స్పందించారు.
అలాగే, "ప్రతి ఒక్కరూ బెస్ట్ కెప్టెన్, బెస్ట్ ప్లేయర్లు జట్టులో ఉండాలని కోరుకుంటారు. అయితే, ఇది కోరుకోవడం గురించి కాదు. ఇది మీ పర్సులో ఎంత ఉంది? దానితో మీరు ఏం చేయగలరు? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఫ్రాంచైజీకి అదే కోరిక ఉంటుంది" అని అన్నారు. రోహిత్ శర్మ లాంటి క్యాలిబర్ ఉన్న ఆటగాడిని కొనుగోలు చేయడం ఏ జట్టుకైనా అసెట్ అవుతుందని పేర్కొన్న ఆయన ఇంత మొత్తం కేటాయించడం సాధ్యం కాదని సంజీవ్ గోయెంకా అన్నారు.