ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చారు.. ఫలితాలు ఇలాగే ఉంటాయి మరి.. టీమిండియాపై మాజీ క్రికెటర్ విమర్శలు

First Published Nov 11, 2022, 6:56 PM IST

భారత క్రికెట్ జట్టు దారుణ అవమానకర ఓటమిని టీమిండియా ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ టోర్నీలో  బ్యాటర్ గా విఫలమై  సెమీస్ లో సారథిగా కూడా ఫెయిల్ అయిన రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

విరాట్ కోహ్లీ భారత జట్టు నుంచి సారథిగా తప్పుకున్నాక సారథుల విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.  సిరీస్ కు ఒక సారథి అన్న ఫార్ములాను పాటించిన బీసీసీఐ.. ఇప్పుడు అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటుందని  భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ దారుణ వైఫల్యంతో అజయ్ జడేజా బీసీసీఐతో పాటు టీమిండియా సారథి రోహిత్ శర్మపైనా విమర్శలు గుప్పించాడు. ఏడాడిలో ఏడుగురు కెప్టెన్లను మార్చడం భారత వైఫల్యానికి కారణమని, రోహిత్ శర్మ  ప్రతీ సిరీస్ కు అందుబాటులో లేకపోవడం వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకున్నదని చెప్పాడు. 
 

ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఓడాక జడేజా స్పందిస్తూ..  ‘నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. బహుశా అది వింటే రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లను బాధపెట్టొచ్చు.  ఒక జట్టును తయారుచేసే క్రమంలో కెప్టెన్ నిత్యం వాళ్లతోనే ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆటగాళ్లతో మంచి సంబంధాలు పెంచుకోవాలి.   గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లీ తప్పుకోవడంతో  రోహిత్ ను సారథిగా నియమించారు. 

ఈ ఏడాదికాలంలో రోహిత్ ఎన్ని సిరీస్ లు ఆడాడు.  నేను ఇదే చాలా రోజుల నుంచే చెబుతున్నా. సిరీస్ కు ఒక సారథిని మార్చినట్టు మార్చుతున్నారు. ఇప్పుడు కూడా చూడండి. టీ20 ప్రపంచకప్ ముగిసింది.  దీని తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ లో రోహిత్ కు విశ్రాంతినిచ్చారు.  

ఒక జట్టులో  ఒకడే నాయకుడు ఉంటే అది అందరికీ మంచిది. అలా కాకుండా ఏడుగురు సారథులుంటే అది చాలా కష్టం..’ అని క్రిక్ బజ్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో కామెంట్స్ చేశాడు. ఇదే షోలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా రోహిత్ పై  ఆగ్రహం వ్యక్తం చేశాడు. పదే పదే బ్రేకులు తీసుకోవాల్సినంత సీరియస్ క్రికెట్ వీళ్లు ఏం ఆడుతున్నారని ప్రశ్నించాడు. 

ఇక సారథుల విషయానికొస్తే టీమిండియా సారథి  పోస్ట్ అనేది  ఓ మ్యూజికల్ చైర్ ఆటగా మారింది.  కోహ్లీ నిష్క్రమణ తర్వాత రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా  లు భారత జట్టుకు సారథులుగా పనిచేశారు.  

కెప్టెన్లే కాదు కోచ్ లు కూడా  మారుతున్నారు.  ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్టుగానే  భారత టీమ్ మేనేజ్మెంట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు విశ్రాంతినిచ్చి  ఆ స్థానంలో ఎన్సీఏ  హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పుతున్నది. నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్ తో జరుగబోయే   టీ20,  వన్డే సిరీస్ లకు హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్ లు  సారథులుగా ఉంటే లక్ష్మణ్ హెడ్ కోచ్ గా ఉండనున్నాడు. 

click me!