కోహ్లీనీ, టెండూల్కర్‌నీ వేరు చేసేది అదే... విరాట్ వరుస వైఫల్యాలతో ట్రెండింగ్‌లో సచిన్...

First Published | Aug 29, 2021, 5:01 PM IST

సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ అయితే, విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి ‘కింగ్’గా కీర్తించబడ్డాడు. సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో 100 సెంచరీలు చేసి, ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలబడితే... విరాట్ కోహ్లీ 13 ఏళ్లలోనే 70 సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు...

16 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చిన టెండూల్కర్‌లా 22 ఏళ్ల పాటు క్రికెట్ ప్రపంచంలో కొనసాగే అవకాశం, కోహ్లీకి లేకపోయినా, సచిన్ క్రియేట్ చేసిన 100 సెంచరీల రికార్డు మాత్రం విరాట్ దాటేస్తారని అంచనా వేశారు క్రికెట్ ఫ్యాన్స్...

అయితే జెట్ స్పీడ్‌తో 70 సెంచరీల మార్కు దాటిన విరాట్ కోహ్లీ, రెండున్నరేళ్లుగా అక్కడే ఆగిపోయాడు. 71వ సెంచరీ లేకుండానే 51 ఇన్నింగ్స్‌లు ముగిసిపోయాయి... అంటే ఎంతగా ఇబ్బందిపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు...


మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లతో 55 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కచ్ఛితంగా సెంచరీ చేసి తీరతాడని భావించారు ఆయన అభిమానులు. అయితే ఈసారి కూడా ఆ ఆశ నెరవేరలేదు...

ఇంగ్లాండ్ టూర్‌లో వరుసగా ఐదో ఇన్నింగ్స్‌లోనూ ఐదో స్టంప్ లైన్‌లో వెళ్తున్న బంతిని వెంటాడి, స్లిప్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ... ఈ సిరీస్‌లో ఇలాగే అవుట్ అవ్వడం ఇది ఐదోసారి...

బౌలర్ మారాడు కానీ విరాట్ కోహ్లీ అవుటయ్యే విధానం మాత్రం మారలేదు... మరోసారి కోహ్లీ సెంచరీ మార్కు చేరుకోకపోవడంతో సచిన్ టెండూల్కర్ పేరు ట్రెండింగ్‌లో కనిపించింది...

‘క్రికెట్ ప్రపంచంలో ఒక్కడే సచిన్ టెండూల్కర్ ఉంటారు. ఆయన రికార్డులు మరెవ్వరూ టచ్ చేయలేరు. 100 సెంచరీలు చేయడమంటే సోషల్ మీడియాలో 100 మిలియన్ల మంది ఫాలోవర్లు తెచ్చుకున్నంత ఈజీ కాదు..’ అంటూ విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు మాస్టర్ ఫ్యాన్స్...

అలాగే  కోహ్లీ 70వ సెంచరీ మార్కు అందుకున్న తర్వాత, ‘విరాట్ నా రికార్డును బ్రేక్ చేస్తే, తనతో కలిసి షాంపైన్ షేర్ చేసుకుంటా...’ అని కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్. ఏ ముహుర్తాన సచిన్ ఆ కామెంట్ చేశాడో కాడో, విరాట్‌కి దిష్టి తగిలినట్టుంది అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

సచిన్ టెండూల్కర్ కూడా విరాట్ కోహ్లీలాగే అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోట్లు ఆర్జించాడు, ఇప్పటికీ ఆర్జిస్తున్నాడు. అయితే కోహ్లీ ప్రచారం చేస్తున్న బ్రాండ్స్, యాడ్స్, ఆదాయం చాలా ఎక్కువ...

దీన్ని కూడా కారణంగా చూపిస్తూ విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్... బ్రాండ్ ప్రమోషన్ల మీద పెట్టిన శ్రద్ధ, ప్రాక్టీస్ మీద పెడితే ఇప్పటికి రిజల్ట్ వేరేగా ఉండేదని అంటున్నారు అభిమానులు...

మరికొందరైతే ఇంకో అడుగు ముందుకు వేసి, విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్‌కి అనుష్క శర్మను కారణంగా చూపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, సాధారణ డాక్టర్ అయిన అంజలిని ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కుటుంబాన్ని నడిపించే బాధ్యత తీసుకోవడంతో సచిన్‌కి క్రికెట్‌కి ఫుల్ టైం కేటాయించే టైం దొరికింది...

విరాట్ కోహ్లీ విషయంలో అలా కాదు, అనుష్క శర్మ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్. అదీకాకుండా అనుష్క కూడా కోహ్లీలాగే అగ్రెసివ్. దీంతో ఫ్యామిలీకి, క్రికెట్‌కి మధ్య సమయాన్ని విభజించలేక కోహ్లీ తడబడుతున్నాడని విశ్లేషిస్తున్నారు...

కొందరు క్రికెట్ పండితులు మాత్రం సచిన్ టెండూల్కర్ పరుగులు చేయలేక ఇబ్బంది పడినప్పుడు, సరైన సమయంలో కెప్టెన్సీని వదిలేశాడని... విరాట్ కోహ్లీ మాత్రం అటు జట్టు కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలు తీసుకోవడం వల్లే ఫెయిల్ అవుతున్నాడని అంటున్నారు...

సచిన్‌కి కూడా ఐదో స్టంప్‌ లైన్‌లో వచ్చే బంతులను ఎదుర్కోవడం ఇబ్బందిగా ఉండేది. అయితే సిడ్నీలో జరిగిన టెస్టులో తనకిష్టమైన కవర్‌డ్రైవ్ లేకుండా 241 పరుగులు చేసి అదరగొట్టాడు టెండూల్కర్...

ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియా టూర్‌లో ఓ భారీ సెంచరీ చేశాడు. పరిస్థితులకు తగ్గట్టుగా తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోవడం సచిన్ టెండూల్కర్ అలవాటు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీలే అదే కొరవడిందంటున్నారు విశ్లేషకులు...

Latest Videos

click me!