రోహిత్-కోహ్లీలకు ఇక కష్టమే.. చెప్పకనే చెప్పిన బీసీసీఐ.. పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంటే..!

First Published Jan 14, 2023, 2:21 PM IST

BCCI: భారత క్రికెట్ కు దశాబ్దకాలంగా సేవలందిస్తున్న టీమిండియా  ప్రస్తుత, మాజీ సారథులు రోహిత్ శర్మ,   విరాట్ కోహ్లీలకు బీసీసీఐ చెక్ పెడుతోంది. ఈ ఇద్దరూ ఇక టీ20 ఫార్మాట్ కు ఎంపికవడం కష్టమే.. 

అంతా భావిస్తున్నట్టుగానే టీమిండియా టీ20 జట్టులో భారత వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు తాజాగా ప్రకటించిన న్యూజిలాండ్ తో పొట్టి ఫార్మాట్ లో  చోటు దక్కలేదు. విరామం,  గాయం వంటి కారణాలేమీ లేకున్నా ఈ ఇద్దరినీ పక్కనబెట్టిన సెలక్టర్లు.. ఇక సీనియర్లకు చోటు కష్టమేనని చెప్పకనే చెప్పారు. 

గతేడాది టీ20  ప్రపంచకప్  వైఫల్యం నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రక్షాళన చేపట్టిన విషయం తెలిసిందే. సీనియర్లు అయిన రోహిత్, కోహ్లీలతో పాటు అశ్విన్,   భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ లను  పొట్టి ఫార్మాట్ నుంచి పక్కనబెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. 
 

వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని కొత్త జట్టును తయారుచేస్తున్న బీసీసీఐ.. యువకులకే ఎక్కువ అవకాశాలు అందిస్తున్నది.  ఇందులో భాగంగానే  ఇటీవలే శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్ లో  రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టి  సారథిగా హార్ధిక్ పాండ్యాను  నియమించింది.   ఇకపై కూడా అతడే కొనసాగనున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. 

ఇదే విషయమై బీసీసీఐ  ప్రతినిధి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా టీ20 జట్టులో  రోహిత్, కోహ్లీల శకం ముగిసినట్టేనని చెప్పాడు. ఇన్‌సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ... ‘అవును. ఇక టీ20 ఫార్మాట్ లో వారిని చూడటం కష్టమే. వాళ్ల ఎగ్జిట్ శాశ్వతమే. భవిష్యత్ లో ఏదైనా జరగొచ్చు గానీ  ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఇద్దరి  కథ ముగిసినట్టే.  

బీసీసీఐ ప్రస్తుతం  2024 టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని   జట్టును తయారుచేస్తున్నది. దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరూ ఆ స్కీమ్ లో లేరు..’ అని అన్నారు.  అయితే రోహిత్ శర్మ ఇటీవల  పాత్రికేయులతో మాట్లాడుతూ..  తానింకా టీ20లను వదిలేయలేదని తెలిపిన విషయం తెలిసిందే. 

కాగా  రోహిత్, కోహ్లీలు ఏం చెప్పినా వాళ్ల భవిష్యత్ ను నిర్ణయించేది తాము (బీసీసీఐ) కాదని, సెలక్టర్లని కుండబద్దలు కొట్టాడు.   వాళ్లిద్దరికీ తమ కెరీర్ గురించి ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని  చెప్పాడు.  ఎవరెన్ని చెప్పినా  ప్రస్తుతం బీసీసీఐ వ్యవహార శైలి చూస్తుంటే  రోహిత్ - కోహ్లీలు  టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడమే తరువాయిగా ఉంది. 

శ్రీలంకతో టీ20 సిరీస్ లో అంటే   కోహ్లీకి రెస్ట్ ఇచ్చామని, రోహిత్ కు గాయమైందని చెప్పిన సెలక్టర్లు.. న్యూజిలాండ్ తో సిరీస్ కు మాత్రం వాళ్లిద్దరినీ ఎందుకు తప్పించారన్నది ప్రకటించలేదు. దీంతో  ఈ ఇద్దరితో పాటు సీనియర్లను పొట్టి ఫార్మాట్ నుంచి శాశ్వతంగా పక్కనబెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.  వన్డే ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో  50 ఓవర్లతో పాటు టెస్టులకు ఆడించి టీ20ల నుంచి తప్పించనున్నారని ప్రచారం జరుగుతున్నది. 

click me!