ఎట్టకేలకు సాయిబాబా కరుణించాడు.. టీమిండియాలోకి పృథ్వీ షా..

First Published Jan 14, 2023, 1:23 PM IST

Prithvi Shaw: చిన్న వయసులోనే భారత జట్టులోకి వచ్చి  తొలి టెస్టులోనే సెంచరీతో కదం తొక్కి  సచిన్, సెహ్వాగ్ లను మరిపించిన  పృథ్వీ షా.. తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. 

భారత జట్టు 2019లో అడిలైడ్ టెస్టు  పరాజయం తర్వాత   పృథ్వీ షా ను  టీమిండియా పక్కనబెట్టేసింది.   వరుసగా పేలవ ప్రదర్శనలతో  అతడు జట్టు నుంచి  తప్పుకున్నాడు. ఐపీఎల్ లో  2021, 2022 లో అద్భుత  ఆటతీరుతో పాటు దేశవాళీలో కూడా   రాణించాడు. 

అయితే  రెండేండ్లుగా  దేశవాళీ, ఐపీఎల్ లలో రాణిస్తున్నా అతడికి జాతీయ జట్టులోకి  చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.  ఇది పృథ్వీ షా కెరీర్ ను నాశనం చేయడం తప్ప మరొకటి లేదని  బీసీసీఐపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

దేశవాళీలో రాణించినా అతడికి జాతీయ జట్టులోకి చోటు దక్కకపోవడంపై అతడు సోషల్ మీడియా వేదికగా  సాయిబాబా ఫోటోలు  పెట్టి సెలక్టర్లపై సెటైర్లు వేసేవాడు. గతేడాది  ప్రధాన టోర్నీలు వదిలేసినా  బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో పాటు అంతకుముందు ఇంగ్లాండ్, వెస్టిండీస్  పర్యటనలలో  షా కు చోటు దక్కలేదు.

న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు షా ఎంపిక కానప్పుడు ఇన్స్టా స్టోరీస్ లో సాయిబాబా ఫోటో పెట్టి.. అందులో ‘సాయిబాబా.. అంతా నువ్వు చూస్తూనే ఉంటావని ఆశిస్తున్నా...’ అని  షేర్ చేశాడు. ఈ పోస్ట్ సెలక్టర్లను ఉద్దేశించి చేసిందేనని నెట్టింట్లో  నెటిజన్లు చెవులు కొరుక్కున్నారు.  

అంతకుముందు కూడా షా.. ‘ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకండి.. అద్భుతాలు మీ మార్గంలోనే ఉన్నాయి’ అని షిర్డీ సాయిబాబా ఉన్న ఫోటోను జతచేసి పోస్ట్ చేశాడు.  ఈ ఫోటో అప్పట్లో వైరల్ గా మారింది. 

తాజాగా న్యూజిలాండ్ తో టీ20లలో షాకు  చోటు దక్కడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికైనా  సాయిబాబా అతడిని కరుణించాడని  కామెంట్స్ చేస్తున్నారు.   అయితే  టీమ్ లోకి వచ్చినా పృథ్వీకి  తుది జట్టులో చోటు దక్కుతుందా..? లేదా..? అన్నది  కాలమే తేల్చాలి. 

న్యూజిలాండ్ తో భారత్  టీ20 జట్టు : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముకేశ్ కుమార్ 

click me!