సూర్యనే నయా యూనివర్సల్ బాస్.. అతడి ముందు ఏబీడీ, గేల్‌లు దిగదుడుపే.. పాక్ మాజీ స్పిన్నర్ ప్రశంసలు

First Published Jan 8, 2023, 4:54 PM IST

Suryakumar Yadav: టీమిండియా  ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వీరవిహారం స్వదేశంలోనే కాదు శత్రుదేశం పాకిస్తాన్ లో కూడా ప్రశంసలు అందుకుంటున్నది.  తాజాగా శ్రీలంకతో మూడో టీ20లో సెంచరీ చేసిన  తర్వాత  పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ కూడా  అతడి ఆటకు మంత్రముగ్దుడయ్యాడు. 

టీ20లలో తన ఆటతో  ప్రస్తుతం కెరీర్ లోనే  ‘బీస్ట్’మోడ్ లో ఉన్నాడు  సూర్యకుమార్ యాదవ్. గతేడాది  34 మ్యాచ్ లలోనే 1,100కు పైగా పరుగులు చేసి  దుమ్మురేపిన  సూర్య భాయ్.. ఈ ఏడాది ఆడిన మూడో మ్యాచ్ లోనే జూలు విదిల్చాడు. శ్రీలంకతో రెండో మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసిన అతడు.. మూడో మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కాడు. 
 

నిన్నటి మ్యాచ్ లో  45 బంతుల్లోనే సెంచరీ బాదిన సూర్య ఆటతీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. స్వదేశంలోనే కాదు మన శత్రుదేశం పాకిస్తాన్ లో కూడా సూర్య ఆటకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా  సూర్య ఆటకు మంత్రముగ్దుడయ్యాడు. 
 

శ్రీలంకతో మూడో మ్యాచ్ ముగిసిన తర్వాత  కనేరియా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  అతడి ముందు  దిగ్గజ ఆటగాళ్లుగా పేరొందిన క్రిస్ గేల్,  ఏబీ డివిలియర్స్ లు కూడా తేలిపోతారని అన్నాడు. కొత్త యూనివర్సల్ బాస్  సూర్యా భాయ్ అని   కొనియాడాడు. 
 

కనేరియా మాట్లాడుతూ.. ‘సూర్య ఇప్పుడు  నయా యూనివర్సల్ బాస్. అతడు ప్రస్తుతం బీస్ట్ మోడ్ లో ఉన్నాడు.  నేను అంతకముందు కూడా ఓసారి చెప్పినట్టు.. ఇటువంటి ఆటగాడు లైఫ్ లో ఒకసారి మాత్రమే అరుదుగా దొరుకుతాడు. ఇక లంకపై మూడో మ్యాచ్ లో అతడు ఆడిన ఇన్నింగ్స్ నభూతో నభవిష్యత్. నాకు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. 

కొంతకాలం క్రితం మనం టీ20 అంటే క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ పేర్లను చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సూర్యను చూస్తే ఆ ఇద్దరూ  తేలిపోతారు. టీ20  క్రికెట్ ను సూర్య ఇప్పటికే నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. రాబోయే రోజుల్లో అతడి విధ్వంసాలు కొనసాగే అవకాశముంది..’ అని  అన్నాడు. 

సూర్య సంచలన ఇన్నింగ్స్ తో  ఈ మ్యాచ్ లో భారత్.. తొలుత బ్యాటింగ్ చేసి  నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.   ఆ తర్వాత లంకను భారత బౌలర్లు 137  పరుగులకే కట్టడి చేశారు. తద్వారా భారత్.. ఈ మ్యాచ్ లో 91 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-1 తేడాతో దక్కించుకుంది. అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 

click me!