భారత పేస్ బౌలర్లలో పస ఉండేది కాదు.. అందుకే మేం హెల్మెట్లు లేకుండా ఆడేవాళ్లం: పాక్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్

First Published Oct 12, 2022, 11:47 AM IST

IND vs PAK: భారత  బౌలింగ్ దళంలో గొప్ప బౌలర్లు ఎందరు ఉన్నా  నాణ్యమైన పేసర్లు ఉండేవారు కాదని.. వాళ్లు బౌలింగ్ చేసేప్పుడు హెల్మెట్ పెట్టుకోకున్నా ఆడేవాళ్లమని పాకిస్తాన్ మాజీ  సారథి సల్మాన్ భట్  సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

పాకిస్తాన్ మాజీ  సారథి సల్మాన్ భట్ భారత పేస్ బౌలింగ్ విభాగంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత పేస్ బౌలర్లలో  పస లేదని, అందుకే వాళ్లు బౌలింగ్ చేసేప్పుడు పాకిస్తాన్ దిగ్గజ బ్యాటర్లుగా ఉన్న సయీద్ అన్వర్, ఆమీర్ సోహైల్ లు హెల్మెట్ కూడా ధరించకుండా ఆడేవారని వ్యాఖ్యానించాడు. 
 

క్రిక్ బ్రిడ్జ్ తో భట్ మాట్లాడుతూ.. ‘అప్పట్లో భారత  పేస్ బౌలింగ్ లో మెరుగైన పేసర్లు లేరు. అందుకే పాక్ ఓపెనర్లైన సయీద్ అన్వర్, ఆమీర్ సోహైల్ లు హెల్మెట్ లు కూడా పెట్టుకోకుండా  కేవలం క్యాప్ పెట్టుకుని ఫీల్డ్ లోకి వెళ్లేవాళ్లు..’ అని అన్నాడు. 

మ్యాచ్ లో మధ్య ఓవర్లలో స్పిన్నర్ల బౌలింగ్ లో  హెల్మెట్ లేకున్నా బ్యాటర్లు ఆడటం  సాధారణమే. కానీ  ఓపెనర్లు కూడా హెల్మెట్ లేకుండా ఆడటమనేది రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే అయినా  తమ బ్యాటర్లు  లైట్ తీసుకున్నారని భట్ తెలిపాడు. 

ఇక ఇదే కార్యక్రమంలో భట్..  పాక్ ప్రమాదకర ఆటగాడు షాహిద్ అఫ్రిదిని ఓపెనింగ్ గా ఎందుకు పంపలేదనే ప్రశ్నకు  బదులిస్తూ.. ‘అఫ్రిది భాయ్  మెరుపులు మెరిపించిన రోజుల్లో  గిల్ క్రిస్ట్, సనత్ జయసూర్య, కలువితరణ వంటి  హిట్టర్లు ఓపెనర్లుగా వచ్చి దూకుడుగా ఆడేవారు. అఫ్రిది కూడా కొన్ని మ్యాచ్ లలో ఓపెనర్ గా వచ్చాడు. 

కానీ తర్వాత అతడే  తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్నాడు. పాకిస్తాన్ జట్టులో మిస్బా ఉల్ హక్ యుగం మొదలైన తర్వాత  అఫ్రిది  ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు. తన స్థానాన్ని  అఫ్రిదియే మార్చుకున్నాడు.  అతడు పాకిస్తాన్ కు రెండేండ్లు సారథిగా ఉండి కూడా ఓపెనర్ గా రాలేదు. వాస్తవానికి ప్లేయర్లు తమ  బ్యాటింగ్ స్థానాలపై  నిర్ణయం తీసుకునే ఆప్షన్ ఉండదు. 
 

కానీ  కెప్టెన్ గా ఉండి కూడా  అఫ్రిది తాను ఓపెనర్ గా రాదలుచుకోలేదు.  తనకు అనుకూలతను బట్టి అఫ్రిది తన స్థానాన్ని మార్చుకునేవాడు...’ అని తెలిపాడు. 
 

భారత పేస్ బౌలర్ల పై కామెంట్లు చేసిన భట్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.  యూట్యూబ్ ఛానెళ్లలో ఆదాయం పెంచుకోవడానికే ఇలాంటి పనికిమాలిన మాట్లాడటంలో పాకిస్తాన్ మాజీలు ఆరితేరారని, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని  కామెంట్స్ చేస్తున్నారు.  

click me!