టెస్టులు ముగిశాయి.. ఇప్పుడు వాటి గురించి మాట్లాడి వేస్ట్.. రిపోర్టర్‌పై మరోసారి నోరు పారేసుకున్న బాబర్

First Published Jan 9, 2023, 11:47 AM IST

జట్టును  విజయవంతంగా నడిపించడంలో అట్టర్ ఫ్లాఫ్ అవుతున్న పాకిస్తాన్ సారథి  మీడియా సమావేశాలలో  కూడా దురుసు ప్రవర్తనతో  వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు.  తాజాగా  పాక్ సారథి మరోసారి.. 

గతేడాది  పాకిస్తాన్  కు  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లు ఆడేందుకు వచ్చాయి. రాక రాక పాక్ కు వచ్చిన ఆ జట్లు..  స్వదేశంలో బాబర్  ఆజమ్  సేనను ఓడించి   సిరీస్ లు కొల్లగొట్టాయి.   తాజాగా న్యూజిలాండ్ తో  కూడా రెండు టెస్టుల సిరీస్ ను  చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా  పాకిస్తాన్ డ్రా చేసుకుంది.   

టెస్టులలో రాణించకపోయినా  పరిమిత ఓవర్ల ఆటలో కూడా  పాకిస్తాన్ కు గొప్ప రికార్డేమీ లేదు. అయితే మైదానంలో స్థాయికి మించి ప్రదర్శన చేసినప్పుడు బయట ఎన్ని  చెప్పినా చెల్లుతుంది కానీ అక్కడ విఫలమై విలేకరుల సమావేశంలో ఇష్టారీతిన వ్యవహరిస్తానంటే కుదరదు. ఈ ప్రాథమిక సూత్రాన్ని బాబర్ మరిచినట్టున్నాడు.  

ఆసీస్, ఇంగ్లాండ్ తో సిరీస్ లో చిత్తుగా ఓడి న్యూజిలాండ్ తో డ్రా చేసుకున్న  ఆ జట్టుపై  వరుసగా విమర్శల వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో బాబర్.. టెస్టు పగ్గాలు వదిలిపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది.  తాజాగా  న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ప్రారంభానికి వచ్చిన బాబర్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే ఎప్పటిలాగే  అతడు సహనం కోల్పోయి సమాధానమిచ్చాడు. 

బాబర్ మాట్లాడుతూ..‘మనం ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్నాం. టెస్టు సిరీస్ లు ముగిశాయి.  వైట్ బాల్ సిరీస్ మీద  మీకు ఏమైనా  ప్రశ్నలు ఉంటే వాటిని అడగండి.. అంతే..’ అంటూ ఘాటుగా  స్పందించాడు. బాబర్ సమాధానం చూసి అక్కడున్న రిపోర్టులంతా నివ్వెరపోయారు. 

న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు కూడా బాబర్ మీడియా సమావేశంలో  ఓ జర్నలిస్టును చూసిన చూపు కూడా వైరల్ గా మారింది.   ప్రెస్ మీట్ ముగియకముందే  సిరీస్ కు  సంబంధించిన విషయాలను ఏకరువు పెట్టి వెళ్లిపోతుండగా ఓ జర్నలిస్టు.. ‘ఇది సరైన పద్ధతి కాదు.  ఇక్కడున్న వాళ్లు మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు..’ అని  అడిగాడు.
 

దానికి బాబర్.. ఓరకంట చూస్తూ  అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో  మీడియా మేనేజర్  జోక్యం చేసుకుని మైక్ కట్ చేయడంతో  బాబర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది
 

click me!