బౌలింగ్ కోచ్ పెట్టుకోవడానికి కూడా మనదగ్గర డబ్బుల్లేవా... - టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్...

First Published Dec 16, 2022, 10:33 AM IST

క్రికెట్ ప్రపంచంలో పురుషాధిపత్యం చాలా ఎక్కువ. పురుష క్రికెటర్లకు రూ.7 కోట్లు ఇస్తున్న బీసీసీఐ, మహిళా క్రికెటర్లకు రూ.1 కోటి ఇచ్చేందుకు తెగ కష్టపడుతుంటే ఎంత వివక్ష ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ ద్వారా వేల కోట్లు ఆర్జిస్తున్న బీసీసీఐ, మహిళా టీమ్‌కి ఓ బౌలింగ్ కోచ్‌ని నియమించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది...

Image credit: Getty

కొన్ని నెలల క్రితమే పురుష క్రికెటర్లతో సమానంగా మహిళలకు మ్యాచ్ ఫీజు పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ రూపంలో వచ్చే వేతనాల విషయంలో మాత్రం పురుష క్రికెటర్లకు, మహిళా క్రికెటర్లకు చాలా తేడా ఉంది...
 

కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఫైనల్ చేరి, రజతం సాధించిన భారత జట్టు... వరుసగా టీ20 మ్యాచులు గెలుస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చింది. రెండో టీ20లో ఆసీస్‌ని ఓడించిన టీమిండియా వుమెన్స్‌కి, మూడో టీ20లో షాక్ తగిలింది... ముంబైలో జరిగిన మూడో టీ20లో 21 పరుగుల తేడాతో ఓడింది హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్...

ramesh powar

రమేశ్ పవార్‌ని టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించింది బీసీసీఐ. ప్రస్తుతం రమేశ్ పవార్, ఎన్‌సీఏలో ఉన్నాడు. హృషికేశ్ కనికర్, భారత వుమెన్స్ టీమ్‌కి బ్యాటింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు. అయితే హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్ లేకుండానే ఆస్ట్రేలియాతో తలబడుతోంది టీమిండియా...

‘బౌలింగ్ కోచ్ లేకపోవడం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. అయితే మా బౌలర్లు బాధ్యత తీసుకుని అదరగొడుతున్నారు. మీటింగ్స్‌లో వాళ్లే ఏం చేయాలనుకుంటున్నారో చెబుతున్నారు. సొంతంగా ప్లాన్స్ వేసుకుని, ఫలితాలు రాబడుతున్నారు. నేను కేవలం సపోర్ట్‌ మాత్రమే చేస్తున్నా...

పూజా వస్త్రాకర్ గాయంతో దూరం కావడం కూడా మాపై ప్రభావం చూపించింది. ఇలాంటి పిచ్‌ల మీద పేసర్ అవసరం చాలా ఉంటుంది. స్పిన్ బౌలర్లపై ఎక్కువగా ఆధారపడితే ప్రత్యర్థి బ్యాటర్లకు బాగా స్కోరు చేసే అవకాశం దొరుకుతుంది...’ అంటూ చెప్పుకొచ్చింది టీమిండియా వుమెన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్...

సీనియర్ పేసర్ జులన్ గోస్వామి, టీమిండియాలో ఉన్నప్పుడు సీనియర్ ఫాస్ట్ బౌలర్‌గానే కాకుండా బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహరించేది. అయితే జులన్ గోస్వామి రిటైర్మెంట్‌తో ఆ స్థానంలో మరో బౌలింగ్ కోచ్‌ని ఇప్పటిదాకా నియమించలేదు బీసీసీఐ... రమేశ్ పవార్ కూడా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాత్రమే ఉండేవాడు.

పురుషుల ఐపీఎల్ ద్వారా వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న బీసీసీఐ, ఈ ఏడాది వుమెన్స్ ఐపీఎల్ ప్రారంభించాలని ఆలోచిస్తోంది. అయితే ఓ బౌలింగ్ కోచ్‌ని నియమించడానికి బీసీసీఐ దగ్గర డబ్బులు లేవా? భారత పురుషుల టీమ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించగలరా? అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.. 

click me!