పొట్టి సమరానికి సన్నద్ధమయ్యేలా.. టీమిండియాకు ఆస్ట్రేలియాలో పెరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లు..

First Published Sep 20, 2022, 5:23 PM IST

T20I World Cup 2022: అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే పొట్టి ప్రపంచకప్  సమరానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ మెగా టోర్నీకి ముందు  టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. 

2007లో ధోని సారథ్యంలో T20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత మళ్లీ 15 ఏండ్లు గడుస్తున్నా ఈ ట్రోఫీని నెగ్గడంలో భారత్ కు ప్రతీసారి నిరాశే ఎదురవుతున్నది. అయితే ఈసారి మాత్రం ఈ మెగా టోర్నీలో గెలిచి ప్రపంచకప్ ను తిరిగి ఇంటికి తీసుకురావాలని టీమిండియా గట్టి సంకల్పంతో ఉంది. ఆ మేరకు ప్రణాళికలు  సిద్ధం చేస్తున్నది.

ప్రపంచకప్ కు ముందు భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాతో కూడా  మ్యాచ్ లు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు అక్టోబర్ 9న ఆసీస్ బయలుదేరాల్సి ఉంది. కానీ తాజా సమాచారం మేరకు  వారం రోజుల (అక్టోబర్ 5) ముందే అక్కడికి వెళ్లనుంది. 

ఆస్ట్రేలియాలో పరిస్థితులకు అలవాటు పడేందుకు గాను వారం రోజుల ముందుగానే టీమిండియా ఆసీస్ కు వెళ్లనుంది. వారం రోజులు ముందు వెళ్లి ఆటగాళ్లు ఎంజాయ్ చేయడానికి,  షాపింగులకు తిరగడానికైతే కాదు. వార్మప్ మ్యాచ్ లతో పాటు భారత జట్టు మరో 2 లేదా 3 ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనున్నట్టు తెలుస్తున్నది. 

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అభ్యర్థన మేరకు బీసీసీఐ దీనికి ఒప్పుకుంది. వాస్తవానికి భారత్.. అక్టోబర్ 17, 19న అక్కడ  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో  వార్మప్ మ్యాచ్ లు ఆడుతుంది.  ఆ తర్వాత  అక్టోబర్ 23న మెల్బోర్న్ లో పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ తో టీ20 ప్రపంచకప్ వేట సాగించనుంది. 

అయితే వారం రోజులు ముందుగానే అక్కడకు వెళ్లనున్న టీమిండియా.. వార్మప్ మ్యాచ్ ల కంటే ముందుగానైనా గానీ అవి ముగిసిన తర్వాత అయినా గానీ ఇతర జట్లను వీలును బట్టి కనీసం రెండైనా ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడితే అక్కడి పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటుపడతారని ద్రావిడ్ భావిస్తున్నాడు.  బీసీసీఐ కూడా అందుకు అంగీకారం తెలిపింది. 

Image credit: PTI

ఇదిలాఉండగా..  ఆస్ట్రేలియా సిరీస్ ముగిశాక భారత్.. సౌతాఫ్రికాతో మూడు టీ20లు ఆడుతుంది. సెప్టెంబర్ 28న తొలి టీ20, అక్టోబర్ 2న రెండో టీ20, అక్టోబర్ 4న మూడో మ్యాచ్ జరుగుతాయి.   ఆ తర్వాత  అక్టోబర్ 6 నుంచి  దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. 

వన్డే సిరీస్ షెడ్యూల్ 6, 9, 11 గా ఉంది. కానీ సఫారీలతో టీ20లు ముగిసిన  వెంటనే (4వ తేదీ)  టీ20 ప్రపంచకప్ కు ఎంపికైనా జట్టు మొత్తం ఆసీస్ కు పయనమవుతుంది. శిఖర్ ధావన్ సారథ్యంలోని రెండో శ్రేణి భారత జట్టు.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. 

click me!