టీ20 ప్రపంచకప్‌కు పంత్ ఎందుకు దండగ.. అతడికంటే వాళ్లిద్దరూ బెస్ట్.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

First Published Sep 20, 2022, 4:41 PM IST

IND vs AUS T20I: టీమిండియా  వికెట్ కీపర్ రిషభ్ పంత్ టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో అతడిని ఆడించొద్దంటున్నాడు  భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్. 

వచ్చే నెల ఆస్ట్రేలియాలో మొదలుకానున్న పొట్టి ప్రపంచకప్ సమరానికి ముందు ఇండియా, ఆసీస్ జట్లు మంగళవారం నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్నాయి. ఈ సిరీస్ కు ముందు  భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

టీ20 ప్రపంచకప్ లో పంత్ ను ఆడించడం వల్ల భారత జట్టుకు ఒనగూరేదేమీ లేదని.. అతడి కంటే వికెట్ కీపర్ గా దినేశ్ కార్తీక్ ను ఎంపిక చేసి స్పిన్ ఆల్ రౌండర్ గా అక్షర్ పటేల్ ను తీసుకోవడం ఉత్తమమని   జాఫర్ అన్నాడు. 

ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ మాట్లాడుతూ.. ‘రిషభ్ పంత్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉంది. అసలు అతడిని టీ20 ప్రపంచకప్ లో ఆడించాలా..? వద్దా..? అనేది తేల్చుకోవాలి. టెస్టులు, వన్డేలలో రిషభ్ నాణ్యమైన ఆటగాడు. అందులో సందేహమే లేదు. 

కానీ టీ20లకు వచ్చేటప్పటికి మాత్రం  ఈ ఫార్మాట్ లో అతడి ఆట ఏమంత గొప్పగా లేదు. వన్డే, టెస్టులలో గేమ్ ఛేంజింగ్ మ్యాచ్ లు ఆడిన పంత్.. పొట్టి ఫార్మాట్ లో ఆ మ్యాజిక్ చూపెట్టలేకపోతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు  ఐపీఎల్ లో కూడా అతడి ప్రదర్శన బాగోలేదు. 

కావున భారత జట్టు ఈ విషయంలో  ఏదో ఒక పరిష్కారం వెంటనే తీసుకోవాలి. పంత్ ను టాప్-6 లో ఆడిస్తారా..? లేక ఓపెనింగ్ కు పంపిస్తారా..? అనేది తేల్చుకోవాలి. 

Image credit: Getty

నా అభిప్రాయం ప్రకారమైతే.. టీ20లలో రిషభ్ 4,5 స్థానాలకు పనికిరాడు. ఇక ఓపెనింగ్ అంటే  ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం కష్టమే. అందుకే పంత్ ను పక్కనబెట్టి దినేశ్ కార్తీక్ ను  వికెట్ కీపర్ గా ఆడిస్తూ  అక్షర్ పటేల్ ను ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దింపాలి.. 

గత కొద్దిరోజులుగా అక్షర్ పటేల్ బాగా రాణిస్తున్నాడు. కానీ అతడిని భారత జట్టు రెగ్యులర్ ఆటగాడిగా ఎందుకు పరిగణించడం లేదో నాకు అర్థం కావడం లేదు. బౌలింగ్ తోనే గాక తన బ్యాటింగ్ తో కూడా అతడు మ్యాచ్ లు గెలిపించగలడు. వెస్టిండీస్ సిరీస్ ఇందుకు నిదర్శనం..’ అని జాఫర్ చెప్పాడు. 

జాఫర్ చెప్పినట్టు టీ20లలో రిషభ్ అంత గొప్పగా ఆడింది లేదు.  ఐపీఎల్-15లో పంత్ ఢిల్లీకి సారథిగా వ్యవహరిస్తూ.. 14 మ్యాచ్ లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. చేసిన పరుగులు 340. సగటు 22.8 గా ఉంది.  ఇక అంతర్జాతీయ టీ20లలో పంత్.. 58 మ్యాచ్ (51 ఇన్నింగ్స్) లలో 934 పరుగులు మాత్రమే చేశాడు.  ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. సగటు 23.95గా ఉంది. 
 

click me!