ఇంగ్లాండ్‌లో ఇరగదీసి, ఆసియా కప్ 2022 టోర్నీకి... 8 ఏళ్ల తర్వాత అక్కడ ఆడబోతున్న టీమిండియా...

First Published Sep 26, 2022, 2:52 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయినా, వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది భారత మహిళా జట్టు. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ గెలిచి రికార్డు క్రియేట్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన, ఆసియా కప్ 2022 టోర్నీకి సిద్ధమవుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ లేకుండా జరుగుతున్న మొట్టమొదటి ఆసియా కప్ టోర్నీ ఇదే...

Image credit: Getty

ఆసియా కప్ టోర్నీలో టీమిండియాకి ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా 7 సార్లు ఆసియా మహిళల కప్ టోర్నీ జరగగా ఆరు సార్లు టైటిల్‌ని సొంతం చేసుకుంది భారత మహిళా టీమ్. 2018 సీజన్‌లోనూ ఫైనల్ చేరిన భారత జట్టు, బంగ్లాదేశ్ చేతుల్లో పరాభవాన్ని మూటకట్టుకుంది...

2016లో టీమిండియా కెప్టెన్‌గా ఆసియా కప్ టైటిల్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్, 2018లో మాత్రం ఆ ఫీట్ రిపీట్ చేయలేకపోయింది. అయితే ఈసారి భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి...

ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇద్దరూ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ టూర్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాల్సిందే...

ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపికైన స్నేహ్ రాణా, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్... ఒంటి చేత్తో మ్యాచ్‌ని మలుపు తిప్పగల సత్తా ఉన్న ప్లేయర్లు. వీరితో పాటు బీబీఎల్‌లో అదరగొట్టిన చిచ్చరపిడుగు జెమీమా రోడ్రిగ్స్‌ కూడా గాయం నుంచి కోలుకుని, ఆసియా కప్‌లో ఆడబోతోంది...

అలాగే దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్ కూడా మ్యాచ్ విన్నర్లే. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత జరగబోయే ఆసియా కప్‌లో ప్రతీ జట్టు లీగ్ స్టేజీలో ఆరు మ్యాచులు ఆడుతుంది. టాప్ 4లో ఉన్న నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ ఆడతాయి...

అక్టోబర్ 1న శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు. ఆ తర్వాత మలేషియాతో అక్టోబర్ 3న, యూఏఈతో అక్టోబర్ 4న మ్యాచులు ఆడుతుంది. తర్వాత దాయాది పాకిస్తాన్‌తో అక్టోబర్ 7న, బంగ్లాదేశ్‌తో 8న మ్యాచులు జరుగుతాయి. అక్టోబర్ 10న థాయిలాండ్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు...

ఆసియా కప్ 2022 మహిళల టోర్నీ మ్యాచులన్నీ బంగ్లాదేశ్‌లోని సీల్హెట్‌లో జరుగుతాయి. చివరిసారిగా 2014లో టీ20 వరల్డ్ కప్ మ్యాచులు ఆడిన భారత జట్టు, 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఆడబోతోంది. 7 దేశాలు పాల్గొనే ఈ టోర్నీ అక్టోబర్ 16న ముగుస్తుంది...

click me!