అశ్విన్‌లాంటి ప్లేయర్‌ను పక్కనబెట్టడం కరెక్టు కాదు... వీవీఎస్ లక్ష్మణ్ కామెంట్...

First Published Aug 12, 2021, 6:24 PM IST

రవిచంద్రన్ అశ్విన్‌లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్‌ను వరుసగా రెండు టెస్టుల్లో పక్కనబెట్టింది టీమిండియా. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా రాణించిన అశ్విన్‌ను తుదిజట్టులో తీసుకోకపోవడంపై క్రికెట్ పండితులు, మాజీ క్రికెటర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వర్షం పడి తొలి రోజు రద్దయిన తర్వాత కూడా ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగింది టీమిండియా. రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజాకి తుదిజట్టులో చోటు దక్కింది..

జడేజా బ్యాటింగ్, బౌలింగ్‌లో ఫెయిల్ కాగా... రవిచంద్రన్ అశ్విన్ స్పిన్‌కి ఏ మాత్రం సహకరించని పిచ్‌పైన నాలుగు వికెట్లు పడగొట్టి... సత్తా చాటాడు.

తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడగొట్టి, భారత జట్టుకి అవసరమైన బ్రేక్‌ను అందించిందీ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కోల్పోయిన రెండు వికెట్లూ తీసిందీ అశ్వినే...

తొలి టెస్టులో పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కి తుదిజట్టులో చోటు ఇచ్చి, అశ్విన్‌ను పక్కనబెట్టిన విరాట్ కోహ్లీ... రెండో టెస్టులో అయినా అతనికి అవకాశం ఇస్తాడని అనుకున్నారంతా. శార్దూల్ గాయపడడంతో అశ్విన్ ఎంట్రీ ఖాయమనుకున్నారు..

అయితే శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు తుదిజట్టులో చోటు ఇచ్చిన విరాట్ కోహ్లీ... ‘12వ ప్లేయర్‌ను ఆడించే అవకాశం ఉంటే, కచ్ఛితంగా అశ్విన్‌ను తీసుకునేవాడిని’ అంటూ కామెంట్ చేశాడు...

డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కౌంటీ మ్యాచ్‌లో పాల్గొని, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి అదరగొట్టినా... అశ్విన్‌కి తుదిజట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు...

‘మళ్లీ అశ్విన్ లేకుండానా?’ అంటూ ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్. నాలుగు సెంచరీలు చేసి 400+ వికెట్లు తీసిన అశ్విన్‌ను పక్కనబెట్టడం ఏ మాత్రం తెలివైన పని కాదంటూ కామెంట్ చేశాడు వాగన్..

‘రవిచంద్రన్ అశ్విన్ చాలా టాలెంటెడ్ బౌలర్. అతను ఎలాంటి పరిస్థితుల్లో అయినా అద్భుతంగా రాణించగలడు... ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించిన భారత జట్టులో అశ్విన్ పాత్ర ఎంతో ఉంది...

స్టీవ్ స్మిత్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌ను రవిచంద్రన్ అశ్విన్ బాగా ఇబ్బంది పెట్టగలిగాడు. భారత జట్టును ఇబ్బందిపెడుతున్న జో రూట్‌ వికెట్ త్వరగా తీయాలంటే అశ్విన్ తుదిజట్టులో ఉండాలి...

ఓవర్‌సీస్ పరిస్థితుల్లో కూడా అద్భుతంగా రాణించగలనని నిరూపించుకున్న రవిచంద్రన్ అశ్విన్‌కి తుదిజట్టులో చోటు లేకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్..
 

click me!