బంగ్లాని ఫాలోఆన్ ఆడించడానికి భయం దేనికి? సెంచరీల కోసమే తిరిగి బ్యాటింగ్ చేస్తున్నారా...

First Published Dec 16, 2022, 11:14 AM IST

బంగ్లాదేశ్ పర్యటనలో మొదటి రెండు వన్డేల్లో ఓడినా, మూడో వన్డే నుంచి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీతో భారీ విజయం అందుకున్న భారత జట్టు, తొలి వన్డేలోనూ పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది టీమిండియా...

48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత ఛతేశ్వర్ పూజారా 90, శ్రేయాస్ అయ్యర్ 86, రవిచంద్రన్ అశ్విన్ 58, రిషబ్ పంత్ 46, కుల్దీప్ యాదవ్ 40  పరుగులతో రాణించి టీమిండియా 404 పరుగుల భారీ స్కోరు అందించారు... భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 1, మహ్మద్ సిరాజ్ 4 మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్లు చేశారు...
 

ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసి బంగ్లాకి షాక్ ఇచ్చాడు మహ్మద్ సిరాజ్. అక్కడి నుంచి ఎక్కడా కోలుకోని బంగ్లాదేశ్ జట్టు 55.5 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ముస్తాఫిజుర్ రహీం 28 పరుగులు చేసి బంగ్లా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశారు.

టీమిండియాకి 254 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కిన తర్వాత కూడా బంగ్లాని ఫాలోఆన్ ఆడించడానికి ఇష్టపడలేదు. బంగ్లా ఆలౌట్ అయిన తర్వాత టీమిండియా మళ్లీ బ్యాటింగ్‌కి దిగింది. టెస్టుల్లో ఫాలోఆన్ ఆడించడం అనేది ఓ గొప్ప ఘనతే. ఆ జట్టుపైన తాము సాధించిన ఆధిపత్యానికి చిహ్నం...

అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్‌తో ఆడేటప్పుడు ఫాలోఆన్ ఆడించడం కొంచెం రిస్క్. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్లు కుదురుకుని భారీ స్కోరు చేస్తే.. నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ల ముందు భారీ స్కోరు పెట్టొచ్చు. ఇలాంటి సందర్బాల్లో పరిస్థితి తేడా కొట్టే ప్రమాదం ఉంది...

అయితే బంగ్లాదేశ్‌కి అంత సీన్ లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్, రెండో ఇన్నింగ్స్‌లో మహా అయితే మరో 30-50 పరుగులు ఎక్కువా? లేదా తక్కువ చేయొచ్చు. టీమిండియాకి దక్కిన 254 ఆధిక్యాన్ని దాటి, భారత జట్టు ముందు 150 పరుగుల లక్ష్యం పెట్టేంత సీన్ అయితే బంగ్లాకి లేదు...

అయినా టీమిండియా, బంగ్లాని ఫాలోఆన్ ఆడించడానికి ఇష్టపడలేదు. దీనికి ఏకైక కారణం బంగ్లాపై తొలి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేయలేకపోవడమే. రాహుల్ 22, శుబ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లీ 1 పరుగులకే పెవిలియన్ చేరారు...

Virat Kohli

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి కనీసం 50+ స్కోరు చేయాలనే ఉద్దేశంతోనే టీమిండియా ఫాలోఆన్ ఎంచుకోలేదు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం వల్ల బంగ్లాపై భారీ తేడాతో గెలవచ్చేమో కానీ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకునే గొప్ప ఛాన్స్ మాత్రం మిస్ అయ్యింది...

click me!