మాంచెస్టర్‌ టెస్టులో టీమిండియాకి దారుణమైన రికార్డు... ఒక్కటంటే ఒక్క విజయం కూడా...

First Published Sep 9, 2021, 3:19 PM IST

ఇంగ్లాండ్, ఇండియా మధ్య టెస్టు సిరీస్‌లో ఆఖరి టెస్టుకి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ సిటీ వేదిక ఇవ్వనుంది. ఇక్కడి ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది...

మాంచెస్టర్‌లో టీమిండియాకి ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు. ఇప్పటిదాకా ఇక్కడ 9 టెస్టులు ఆడిన భారత జట్టు, నాలుగింట్లో ఓడింది, ఐదు మ్యాచులను డ్రా చేసుకుంది...

1936 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం అందుకోలేకపోయింది భారత జట్టు.1936, 1946 పర్యటనల్లో జరిగిన రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి...

1952లో జరిగిన టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్, 207 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత 1959లో జరిగిన టెస్టులో 171 పరుగుల తేడాతో పరాజయం పాలైంది...

1974లో జరిగిన టెస్టులో భారత జట్టు 113 పరుగుల తేడాతో ఓడగా... చివరిగా 2014లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకి ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఘోర ఓటమి ఎదురైంది...

1952 జరిగిన మూడో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులకి, రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకి ఆలౌట్ అయ్యింది... ఈ మైదానంలో టీమిండియాదే అత్యల్ప స్కోరు...

ఇక్కడ ఇప్పటిదాకా 82 టెస్టు మ్యాచులు జరగగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 32 సార్లు, మొదట బౌలింగ్ చేసిన జట్లు 15 సార్లు విజయం సాధించాయి. మిగిలిన 35 మ్యాచులు డ్రాగా ముగిశాయి...

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు ఇక్కడ మూడు మ్యాచులు ఆడింది. పాకిస్తాన్‌ను 89 పరుగుల తేడాతో, వెస్టిండీస్‌ను 125 పరుగుల తేడాతో ఓడించిన భారత్, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో 18 పరుగుల తేడాతో ఓడింది...

2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ ఓటమి తర్వాత మాంచెస్టర్‌లో టీమిండియా ఆడబోతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇదే. అయితే ఇక్కడ రోహిత్ శర్మకు ఓ వన్డే సెంచరీ (పాకిస్తాన్‌పై) ఉండడం విశేషం.

click me!