IND vs AUS: నిలబడితే కలబడొచ్చుగా.. అంత తొందరేందయ..! ఆసీస్‌తో తొలి టీ20లో రోహిత్, కోహ్లీలు విఫలం

First Published Sep 20, 2022, 7:44 PM IST

IND vs AUS T20I: మొహాలీ వేదికగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత బ్యాటింగ్ మూలస్తంబాలైన    రోహిత్ శర్మ,  విరాట్ కోహ్లీ లు దారుణంగా విఫలమయ్యారు. 

అసలే టీ20  ప్రపంచకప్ ముందుంది.. జట్టుకు ముందుండి నడపాల్సిన బాధ్యత వాళ్లిద్దరి మీదా ఉంది. ఇద్దరూ  అనుభవంలో, ఆటలో ఆరితేరినవారే. కానీ అదే తొందర.  కాస్త నిలబడితే  పరుగులు వచ్చే పిచ్ ల మీద కూడా ఆతృత బ్యాటింగ్ తో వికెట్లు ఇచ్చుకున్నారు టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు. 

మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. రోహిత్ (11), కోహ్లీ (2) ల వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది.  రోహిత్.. ఎప్పటిలాగే తొందరగా ఆడే క్రమంలో వికెట్ ను సమర్పించుకోగా కోహ్లీ  కట్ షాట్ కు యత్నించి విఫలమయ్యాడు. 

తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్ కు.. శుభారంభం దక్కలేదు.  పాట్ కమిన్స్ వేసిన  ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ కొట్టిన  రోహత్.. అదే ఊపులో మరో భారీ షాట్ ఆడాడు. జోష్ హెజిల్వుడ్ వేసిన  మూడో ఓవర్ నాలుగో బంతి  ఫుల్ లెంగ్త్ డెలివరీ కాగా.. డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాలని చూశాడు రోహిత్.కానీ బంతి మాత్రం నేరుగా వెళ్లి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న  నాథన్ ఎల్లిస్ చేతుల్లో పడింది. 
 

ఇక హిట్ మ్యాన్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. గత మ్యాచ్ (ఆసియా కప్ లో అఫ్గానిస్తాన్ తో) లో సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్ లో కూడా అటువంటి ప్రదర్శనే చేస్తాడని ప్రేక్షకులు భావించారు.  

Image credit: Getty

కానీ 7 బంతుల్లో 2 పరుగులు చేసిన  కోహ్లీ..  నాథన్ ఎల్లిస్ వేసిన  ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో కామెరూన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

మొహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఇక్కడ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడితే భారీ స్కోర్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. పవర్ ప్లేలో కాస్త నెమ్మదిగా ఆడినా తర్వాత విజృంభించడం ఈ ఇద్దరికీ  వెన్నతో పెట్టిన విద్య. కానీ ఈ ఇద్దరూ ఆతృతగా ఆడి వికెట్లను చేజార్చుకోవడం టీమిండియా ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తున్నది. 

click me!