నన్నే విమర్శిస్తున్నారు.. వాళ్లకు ఆ మాత్రం తెలియదా..? : మాజీలపై పాక్ సారథి ఆగ్రహం

First Published Sep 20, 2022, 6:10 PM IST

Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ తనపై విమర్శలు చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  జట్టుగా తాము విఫలమవుతున్నా తనను టార్గెట్ చేయడమేంటని మండిపడ్డాడు. 

ఆధునిక క్రికెట్ లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా  మన్ననలు అందుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ గత కొద్దిరోజులుగా సరైన పామ్ లో లేడు. ముఖ్యంగా టీ20లలో అతడి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆసియా కప్ లో అయితే బాబర్ పేలవ ఫామ్ ప్రదర్శించాడు. ఆరు మ్యాచ్ లలో అతడు 68 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ కూడా 107.94గా ఉంది. 

బాబర్ బ్యాటింగ్ తో పాటు  ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడటంతో పాక్ మాజీలు అతడిని టార్గెట్ చేశారు. బాబర్ కెప్టెన్సీ వైఫల్యం, అతడి  పేలవ బ్యాటింగ్ పై షోయభ్ అక్తర్,  అకీబ్ జావేద్ వంటి మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం గుప్పించారు. 

మంగళవారం నుంచి ఇంగ్లాండ్ తో ఏడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం సందర్భంగా  విలేకరుల సమావేశానికి వచ్చిన బాబర్ తనపై వస్తున్న విమర్శలపై ఘాటు కామెంట్స్ చేశాడు. బాబర్ మాట్లాడుతూ.. ‘అందరికీ వారి వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. కానీ నేను మాత్రం పాకిస్తాన్ జట్టు గురించే మాట్లాడాలని అనుకుంటున్నాను.  

మాజీ ఆటగాళ్లు  తమ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు.  కానీ నిరాశపరిచేది ఏంటంటే నామీద వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.  మరి వాళ్లు కూడా ఒకప్పడు ఈ దశ నుంచి వచ్చిన వారే.  అంతర్జాతీయ మ్యాచ్ లలో ఒత్తిడి ఎలా ఉంటుంది.??  ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాలి..? అనేది వాళ్లకూ తెలుసు. 

అయితే వాళ్లు చేసిన ఈ వ్యాఖ్యలపై నేనేమీ బాధపడను. అది వాళ్ల అభిప్రాయమైతే సరే మంచిది. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. నా వరకైతే రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ చాలా ముఖ్యమైనది.  వ్యక్తిగతంగా నేను తిరిగి ఫామ్ లోకి రావడానికి ఈ సిరీస్ నాకు చాలా ముఖ్యం.  ఆ మేరకు నా శాయశక్తులా కృషి చేస్తా. కెరీర్ లో గడ్డు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు..’ అని  చెప్పాడు బాబర్.. 

click me!