టీమిండియాలో నువ్విప్పుడు ఏ పాత్రలోనూ సెట్ కాలేవు : రిషభ్ పంత్ ‌పై మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

First Published Oct 5, 2022, 2:03 PM IST

Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్  రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.  మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అతడు విఫలమై మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 

భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్   ప్రస్తుత భారత టీ20 జట్టులో ఏ పాత్రకూ కూడా న్యాయం చేయలేడని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. పంత్ కంటే దినేశ్ కార్తీక్ తన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తున్నాడని తెలిపాడు. 

ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికా సిరీస్ కు ఎంపికైన పంత్.. కార్తీక్ తో పోటీ పడుతున్నాడు. టీ20  ప్రపంచకప్ కు  వీళ్లిద్దరూ ఎంపికయ్యారు. కానీ ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీస్ లలో మాత్రం రెండు మ్యాచ్ లు ఆడే అవకాశమే వచ్చింది.  దీంతో టీ20 ప్రపంచకప్ లో కూడా పంత్ ను ఆడించేది అనుమానమేనని  స్పష్టమవుతున్నది. 

దక్షిణాఫ్రికా తో ఆఖరి టీ20లో పంత్.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ కు  వచ్చాడు.   14 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.  మరోవైపు దినేశ్ కార్తీక్  మాత్రం అదరగొడుతున్నాడు.  ఫినిషర్ పాత్రకు సరైన న్యాయం పోషిస్తూ చివర్లో వచ్చి రఫ్ఫాడిస్తున్నాడు. 

తాజాగా ఇదే విషయమై  అజయ్ జడేజా స్పందిస్తూ.. ‘నాకు తెలిసి   ప్రస్తుత జట్టులో రిషభ్ పంత్ కు  జట్టులో స్థానం లేదు. ఎందుకంటే ఇప్పుడు టీమిండియాలో ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర ఉంది.   ప్రపంచకప్ లక్ష్యంలో ఎవరెవరు ఏం చేయాలనేదానిపై అందరికీ స్పష్టత ఉంది. కానీ రిషభ్ పంత్ మాత్రం ఇందులో ఏ పాత్రకూ సరిపోడు. అందుకే అతడికి అవకాశాలు రావడం లేదు.. 

మరోవైపు డీకే (దినేశ్ కార్తీక్)  తన పాత్రకు సరైన న్యాయం చేస్తున్నాడు. ఒకవేళ అతడు అలా ఆడకుండా ఉండి ఉంటే కార్తీక్ కు తుది జట్టులో చోటు దక్కేది కాదు.  పంత్ కూడా తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ పార్ట్నర్ కార్తీక్ ను చూసి నేర్చుకోవాలి.  భేషజాలు వదిలేసి కార్తీక్ దగ్గరకెళ్లి బ్యాటింగ్ టిప్స్ అడగాలి.. 

తాను ఏం కోల్పోతున్నాడు..?  కార్తీక్  ఎందుకు విజయవంతమవుతున్నాడు..? అనే విషయాలు అతడిని అడిగి తెలుసుకోవాలి. కార్తీక్ 15 ఏండ్ల పాటు  జట్టులోకి తిరిగి రావడానికి పడరాని కష్టాలు పడ్డాడు.  అందుకే  రిటైర్మెంట్ వయసులో ఉన్నా సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకొచ్చారు. ఒకవేళ  అలా ఆడకుంటే  ఎవరూ పట్టించుకోరు..’ అని జడేజా సూచించాడు. 

click me!