ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు రద్దు... వచ్చే ఏడాది తేలనున్న సిరీస్ ఫలితం...

First Published Sep 10, 2021, 1:28 PM IST

శ్రీలంక టూర్‌లో భారత జట్టు టీ20 సిరీస్ కోల్పోవడానికి కారణమైన కరోనా వైరస్... ఇంగ్లాండ్ టూర్‌లోని టీమిండియాను వదలడం లేదు. ఐదో టెస్టు ఆరంభానికి ముందు భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో ఆఖరి నిమిషంలో చివరి టెస్టును రద్దు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు...

భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లతో పాటు ఫిజియోథెరపిస్ట్‌ల కరోనా బారిన పడగా... గురువారం అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మర్‌కి పాజిటివ్ రావడంతో భారత జట్టులో కలవరం మొదలైంది...

భారత జట్టు ప్లేయర్లు అందరికీ రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా... ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని, మరోసారి టెస్టులు నిర్వహించాల్సిందిగా పట్టుబట్టింది...

దీంతో ఐదో టెస్టుకి ముందు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్ల బోర్డులు. బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మధ్య జరుగుతున్న సమావేశం ముగిసిన తర్వాత ఐదో టెస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు...

ఐదో టెస్టును పూర్తిగా రద్దు చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కోరిన్నట్టు సమాచారం. సాధారణంగా అయితే ఆఖరి టెస్టు రద్దయితే ఆధిక్యంలో టీమిండియా 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలుస్తుంది.

అయితే ఇంగ్లాండ్ మాత్రం ‘మేం మ్యాచ్ ఆడలేం’ అని రద్దు చేసుకుని పోవాలంటూ బీసీసీఐని కోరుతోంది. అంటే విన్ డిక్లేర్ ఇచ్చినట్టే. ఇలా చేసేందుకు భారత్ క్రికెట్ బోర్డు సుముఖంగా లేకున్నా, ఐపీఎల్ కోసం అంగీకరించాల్సి వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి...

అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఐదో టెస్టు ప్రారంభమైతే 14న ఆఖరి రోజు ఆట జరుగుతుంది. 15న యూఏఈ బయలుదేరి, 19 నుంచి ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో పాల్గొనాలని భావించారు భారత క్రికెటర్లు...

ఈ నిర్ణయంతో ఐదో టెస్టు జరగకుండానే విజయాన్ని అందుకుంది ఇంగ్లాండ్. టెస్టు సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసిందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది కూడా...

అయితే బీసీసీఐ మాత్రం దీనికి ఒప్పుకోలేదని సమాచారం. టెస్టు సిరీస్‌ 2-1 తేడాతోనే ముగుస్తుందని భారత జట్టు పేర్కొంటోంది... దీంతో ఇంగ్లాండ్ బోర్డు కూడా తమ ప్రకటనలో జరిగిన తప్పులను సరి చేస్తూ, కేవలం టెస్టు రద్దయినట్టు పేర్కొంది...

వచ్చే ఏడాది వన్డే, టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమిండియా, ఆ సమయంలో ఐదో టెస్టు ఆడుతుంది. ఆ టెస్టు మ్యాచ్ ఫలితం తర్వాత  టెస్టు సిరీస్ రిజల్ట్ నిర్ణయించబడుతుంది...

click me!