19 ఏళ్ల తర్వాత తొలిసారిగా... లీడ్స్‌లో టీమిండియా పర్ఫామెన్స్ ఎలా ఉందంటే...

First Published Aug 22, 2021, 10:57 AM IST

ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచిన టీమిండియా... మూడో టెస్టు కోసం లీడ్స్‌కి బయలుదేరి వెళ్లింది. హెడ్డింగ్‌లేలో 19 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది...

ఇప్పటిదాకా ఈ వేదికలో ఇండియా, ఇంగ్లాండ్ జట్లు ఆరుసార్లు తలబడ్డాయి. మూడు సార్లు ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే, రెండు సార్లు టీమిండియా గెలిచింది... ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది...

1952లో తొలిసారి ఇక్కడ టెస్టు మ్యాచ్ జరగగా, ఆ తర్వాత 1959, 1967 లలో జరిగిన టెస్టుల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది ఇంగ్లాండ్ జట్టు....

1979లో జరిగిన టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా, ఆ తర్వాత 1986లో, 2002లో జరిగిన రెండు టెస్టుల్లో విజయాలు అందుకుంది... 2002 తర్వాత 19 ఏళ్లకు మళ్లీ ఇక్కడ టెస్టు మ్యాచ్ జరగనుంది...

1986లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకి కపిల్‌దేవ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 272 పరుగులు చేయగా, భారత బౌలర్లు విజృంభించడంతో 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్...

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 237 పరుగులు చేయగా 408 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు 128 పరుగులకి ఆలౌట్ అయ్యింది... 280 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం అందుకుంది.

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2002లో లీడ్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా... ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 628 పరుగుల భారీ స్కోరు చేసింది...

రాహుల్ ద్రావిడ్ 307 బంతుల్లో 23 ఫోర్లతో 148 పరుగులు చేయగా సచిన్ టెండూల్కర్ 330 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 193 పరుగులు చేసి డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. కెప్టెన్ సౌరవ్ గంగూలీ 167 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 128 పరుగులు చేశాడు...

భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడు, నాలుగు, ఐదో స్థానంలో వచ్చిన రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సెంచరీలు నమోదుచేయగా ఓపెనర్ సంజయ్ బంగర్ 68 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ ఫెయిల్ అయ్యారు...

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అలెక్ స్టీవర్ట్ 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.. టీమిండియా, ఇంగ్లాండ్‌ను ఫాలో‌ఆన్ ఆడించగా... రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 309 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ 110 పరుగులు చేశాడు... 

భారత జట్టుకి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. ఈ టెస్టు మ్యాచ్ ఆగస్టు 22న ప్రారంభం కాగా... 25న ముగిసింది. సరిగ్గా ఈ టెస్టు మ్యాచ్ ముగిసిన 19 ఏళ్లకు భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు మొదలు అవుతుండడం మరో విశేషం...

click me!