మ్యూజికల్ ఛైర్స్ ఆటలా మారిన టీమిండియా కెప్టెన్సీ... కోహ్లీ తర్వాత అరడజను మంది...

First Published Jun 27, 2022, 11:25 AM IST

జట్టులో ప్లేయర్లు ఎంత మంది ఉన్నా, కెప్టెన్ మాత్రం ఒక్కడే ఉండాలి. అయితే టీమిండియా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా తయారైంది. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు, బిజీ షెడ్యూల్.. కారణమేదైనా ఒక్కో సిరీస్‌కి ఒక్కో కెప్టెన్‌గా అన్నట్టుగా తయారైంది భారత జట్టు పరిస్థితి...

సౌరవ్ గంగూలీ, ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ... ఇలా టీమిండియా నడిపించిన మాజీ సారథులు ప్రతీ సిరీస్‌కి అందుబాటులో ఉండేవాళ్లు. ఆస్ట్రేలియాతో సిరీస్ అయినా ఐర్లాండ్‌తో సిరీస్ అయినా టీమ్‌కి అందుబాటులో ఉండేవాళ్లు...

Virat Kohli-Rohit Sharma

అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. బిజీ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్‌కి ముందు, ఐపీఎల్ ముగిసిన తర్వాత రెస్ట్ కోరుకుంటున్నారు ప్లేయర్లు. మరికొందరు ఎడతెడపి లేని క్రికెట్ కారణంగా జట్టుకి దూరమవుతున్నారు. దీంతో కొత్త కెప్టెన్లను ఎంపిక చేయడం, కెప్టెన్లను మార్చడం అనివార్యంగా మారిపోయింది...

ఈ ఏడాది ఆరంభంలో కేప్‌టౌన్ టెస్టు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. అంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 సిరీస్, టీ20 కెప్టెన్‌గా తనకి ఆఖరిదని ప్రకటించాడు విరాట్. ఆ తర్వాత కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

సౌతాఫ్రికా టూర్‌కి ముందు రోహిత్ శర్మ గాయపడడంతో కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్‌గా ఆడిన రెండో టెస్టులో, వన్డే సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంకలతో సిరీస్‌లు ఆడింది టీమిండియా...

ఆ తర్వాత ఐపీఎల్ 2022 సీజన్ ఆడిన రోహిత్ శర్మ, బాగా అలిసిపోయానని చెప్పి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి రెస్ట్ కావాలని తప్పుకున్నాడు. దీంతో కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంచుకుంది బీసీసీఐ. అయితే సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ కూడా గాయపడడంతో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ దక్కింది...

తాజాగా కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లెక్క ఇక్కడితో ఆగుతుందని అనుకుంటే... ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి ముందు రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలాడు. 

కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాకపోతే నిబంధనల ప్రకారం వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రిత్ బుమ్రాకి కెప్టెన్సీ దక్కాలి. ఇదే జరిగితే ఒకే ఏడాదిలో కాదు కాదు... ఆరు నెలల గ్యాప్‌లో టీమిండియా అరడజను కెప్టెన్లను మార్చినట్టు అవుతుంది...

ఆరు నెలల లెక్కే ఇలా ఉంటే ఏడాది లెక్క వేస్తే టీమిండియాకి కెప్టెన్సీ చేసిన వారిలో శిఖర్ ధావన్, అజింకా రహానే కూడా ఉన్నారు. లంక పర్యటనలో శిఖర్ ధావన్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తే, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకి అజింకా రహానే సారథిగా వ్యవహరించాడు.

చూస్తుంటే టీమిండియా కెప్టెన్సీ మ్యూజికల్ ఛైర్స్‌ ఆటలా మారిందని, ఎవరుపడితే వాళ్లు వచ్చి కూర్చుంటున్నాడని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. ఆరు నెలల్లో అరడజను మంది కెప్టెన్లు మారారంటే మిగిలిన ఆరు నెలల టైంలో ఇంకెంత మంది ప్లేయర్లు కెప్టెన్సీ చేబడతారోనని వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు...

Image credit: PTI

టీమిండియా కెప్టెన్సీ కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌, రవీంద్ర జడేజాలకు కూడా కెప్టెన్సీ ఇచ్చి చూడాలంటూ భారతజట్టు మేనేజ్‌మెంట్‌కి సలహాలు ఇస్తున్నారు. ఎమ్మెస్ ధోనీ తన కెప్టెన్సీ వారసుడిగా విరాట్ కోహ్లీని తయారుచేస్తే.. విరాట్ తన వారసుడిని తయారుచేయడంలో ఫెయిల్ అయ్యాడని, ఆ అవకాశం కూడా బీసీసీఐ.. కోహ్లీకి ఇవ్వలేదని ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు.. 

click me!