ఇంగ్లాండ్‌కి పయనమైన మయాంక్ అగర్వాల్... రోహిత్ శర్మ కోలుకోవడం అనుమానమేనా...

First Published Jun 27, 2022, 12:23 PM IST

ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకి ఐదు రోజుల ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఐదో టెస్టు ప్రారంభమయ్యే జూలై 1 తేదీ నాటికి రోహిత్ శర్మ పూర్తిగా కోలుకుని, టీమ్‌కి అందుబాటులోకి వస్తాడా? లేదా? అనేది ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్‌కి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది...

గత ఏడాది సెప్టెంబర్‌లో మంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు, అప్పుడు టీమిండియా బృందంలో కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా రద్దు అయ్యి, ఆ తర్వాత వాయిదా పడినట్టు ప్రకటించబడింది. అప్పటికే భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉండడంతో టీమిండియాకే సిరీస్ ఇవ్వాలని బీసీసీఐ, లేదు ఐదో టెస్టు ఆడకుండా పోయినందుకు అది మేమే గెలిచినట్టు ప్రకటించాలని ఈసీబీ వాదించాయి...

దీంతో టెస్టు సిరీస్ ఫలితాన్ని తేల్చేందుకు ఐదో టెస్టును నిర్వహించి తీరాల్సిందేనని ఇరుజట్లు నిర్ణయానికి రావడంతో జూలై 1 నుంచి బర్మింగ్‌హమ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పుడు కూడా ఐదో టెస్టుకి ముందు టీమిండియా బృందంలో కరోనా కలకలం రేగడం విశేషం...

టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్‌గా తేలి, ఆలస్యంగా ఇంగ్లాండ్‌కి పయనం కాగా... ఇంగ్లాండ్ టూర్‌కి ముందే విరాట్ కోహ్లీ కరోనా బారిన పడి కోలుకున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా లీస్టర్‌షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలాడు...

మ్యాచ్ ఆరంభానికి 5 రోజుల ముందు కరోనా బారిన పడిన రోహిత్ శర్మ, టెస్టు మ్యాచ్ ఆరంభ సమయానికి టీమ్‌కి అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారడంతో అతనికి స్టాండ్ బైగా మయాంక్ అగర్వాల్‌ని ఇంగ్లాండ్‌కి పంపించింది టీమిండియా.

ఇప్పటికే సోమవారం లండన్ ఫ్లైట్ ఎక్కిన మయాంక్ అగర్వాల్, త్వరలో టీమిండియా క్యాంపులో కలవబోతున్నాడు. లీస్టర్‌షైర్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి శ్రీకర్ భరత్ ఓపెనింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అవసరమైతే హనుమ విహారి, ఛతేశ్వర్ పూజారా కూడా ఓపెనింగ్ చేయగలరు...

అయితే మయాంక్ అగర్వాల్‌‌ను స్టాండ్‌బై ఓపెనర్‌గా ఇంగ్లాండ్‌ టూర్‌కి పిలిపించిన బీసీసీఐ, రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే ఐదో టెస్టు ఆడించాలని చూస్తోంది. మయాంక్ అగర్వాల్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి... 

ఇప్పటికే టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు చేసిన మయాంక్ అగర్వాల్‌కి సుదీర్ఘ ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. అయితే రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ ఎంట్రీతో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌‌కి టెస్టుల్లో చోటు కరువైపోయింది...

గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్ 2021లో మొదటి టెస్టుకి దూరమై, సిరీస్ మొత్తంలో ఆడలేకపోయిన మయాంక్ అగర్వాల్, 2021 వరల్డ్ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 150 పరుగులు చేసి అదరగొట్టాడు.. 

click me!