అసలే ఫలితం రాలేదని ఏడుస్తుంటే... ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత...

First Published Aug 11, 2021, 1:20 PM IST

ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఐదో రోజు ఎడతెడపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. అసలే ఫలితం రాలేదని ఏడుస్తుంటే... ఇరు జట్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించి షాక్ ఇచ్చింది ఐసీసీ...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 65.3 ఓవర్లలో ఆలౌట్ కాగా... టీమిండియా  తొలి రోజు 13 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగలిగింది...

తొలి రోజు ఎలాంటి వర్షం అంతరాయం లేకుండా 90 ఓవర్లు వేయాల్సిన చోట కేవలం 79 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత రెండు, మూడో రోజు వర్షం అంతరాయం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాలేదు... 

నాలుగో రోజు పూర్తి ఆట కొనసాగినా పూర్తి చేయాల్సిన కోటాకి 11 ఓవర్లు తక్కువగా వేశాయి ఇరు జట్లు. దీంతో స్లో ఓవర్ రేటు కారణంగా ఇరు జట్ల ఆటగాళ్ల ఫీజులో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 టోర్నీలో జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌ ఇది. వర్షం కారణంగా డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్ వల్ల ఇరు జట్ల ఖాతాలో చెరో నాలుగు పాయింట్లు చేరాయి...

అయితే స్లో ఓవర్ రేటు నిబంధనల కారణంగా ఈ నాలుగు పాయింట్లలో రెండు పాయింట్లు కోత విధించింది ఐసీసీ. 

దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్, ఇండియా రెండూ కూడా రెండేసి పాయింట్లతో 33 శాతం విజయాల రేటుతో ఉన్నాయి... డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టును నిర్ణయించేందుకు ఈ పాయింట్లు చాలా కీలకం అవుతాయి. 

డబ్ల్యూటీసీ 2019-21 టోర్నీలో ఫైనల్ చేరేందుకు అవసరమైన పాయింట్లు సాధించినప్పటికీ, స్లో ఓవర్ రేటు కారణంగా పాయింట్ల కోతకు గురైన ఆస్ట్రేలియా, ఫైనల్ చేరలేకపోయింది...

ఆస్ట్రేలియా స్థానంలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచిన న్యూజిలాండ్... ఫైనల్‌లో మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే.

click me!