లెక్కలు తప్పాయి.. టీమిండియా కథ ముగిసింది.. ఆసియా కప్ ఫైనల్ ప్రత్యర్థులు తారుమారు

First Published Sep 8, 2022, 11:02 AM IST

Asia Cup 2022: ఈ టోర్నీకి ముందు పదిహేను రోజుల వ్యవధిలో మూడు సార్లు భారత్-పాక్ లు మూడుసార్లు తలపడతాయని అంతా భావించారు. గ్రూప్ దశలో ఓసారి.. సూపర్ - 4లో మరోసారి తలపడి.. చివరికి ఫైనల్ కూడా ఈరెండు జట్ల మధ్యే అనుకున్నారు. కానీ.. 
 

ఆసియా కప్-2022లో భారత్ ఫైనల్ చేరాలంటే ఏం చేయాలనేదానిమీద బుధవారం  చర్చోపచర్చలు జరిగాయి.  వరుసగా  పాకిస్తాన్, శ్రీలంకల మీద ఓడిన తర్వాత భారత జట్టు  టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ సాంకేతికంగా టీమిండియాకు ఒక అవకాశం ఉండేది.  అది అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ మ్యాచ్ లో.. అఫ్గాన్ మ్యాచ్ గెలిస్తే మనకు ఫైనల్ చేరే మార్గం దొరికేది. 

కానీ లెక్కలు తప్పాయి.  గణాంకాలను తారుమారు చేస్తూ అఫ్గాన్-పాక్ మధ్య బుధవారం జరిగిన  షార్జా వేదికగా ముగిసిన  ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ విజయం సాధించింది.   దీంతో ఈ టోర్నీలో భారత్ కథ ముగిసినట్టైంది. 

ఈ టోర్నీకి ముందు పదిహేను రోజుల వ్యవధిలో మూడు సార్లు భారత్-పాక్ లు మూడుసార్లు తలపడతాయని అంతా భావించారు. గ్రూప్ దశలో ఓసారి.. సూపర్ - 4లో మరోసారి తలపడి.. చివరికి ఫైనల్ కూడా ఈరెండు జట్ల మధ్యే జరుగుతుందని అంతా అనుకున్నారు. అయితే దాయాది దేశాల అభిమానుల కోరిక సగం మాత్రమే నెరవేరింది. 

చిరకాల ప్రత్యర్థులు ఈ టోర్నీలో గడిచిన రెండు ఆదివారాల్లో రెండుసార్లు తలపడ్డారు.  చెరో విజయం దక్కింది. కానీ ఫైనల్ లో మాత్రం ఈ రెండు జట్లు కాకుండా  శ్రీలంక-పాకిస్తాన్ మధ్య  ఫైనల్ జరుగబోతున్నది.  దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. 

భారత్-పాకిస్తాన్ మాదిరే.. శ్రీలంక-పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో రెండు సార్లు తలపడనున్నాయి. సూపర్-4లో భాగంగా శ్రీలంక-పాకిస్తాన్ లు శుక్రవారం మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ తర్వాత  ఫైనల్ కూడా ఈ రెండు జట్ల మధ్య జరుగనుంది.  

అసలు ఈ  టోర్నీలో లంక ఫైనల్ చేరడం  గొప్ప విషయం.  వాస్తవానికి ఈ టోర్నీ లంకలోనే జరగాల్సి ఉండగా అక్కడ ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా దానిని యూఏఈకి షిఫ్ట్ చేశారు. అదీగాక గత కొంతకాలంగా శ్రీలంక నానాటికీ దిగజారే ప్రదర్శనతో విమర్శలను మూటగట్టుకుంటున్నది. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టులోకి వచ్చిన కొత్తవాళ్లు పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
 

తొలి మ్యాచ్ లో అఫ్గాన్ తో లంక ఆట చూసినవారికి అసలు ఆ జట్టు సూపర్-4 చేరితే గొప్ప అనుకున్నారు. కానీ  తొలి మ్యాచ్ ఓడాక ఆ జట్టు మేల్కొంది. తర్వాత  బంగ్లాదేశ్ ను ఓడించి సూపర్ - 4లో మళ్లీ అఫ్గాన్ ను మట్టికరిపించింది. మంగళవారం భారత్ ను ఓడించి ఫైనల్ కు అర్హత సాధించింది.  

ఈ టోర్నీలో విజయం సాధించి ఆసియా కప్ ను దక్కించుకోవడం లంకకు అత్యవసరం. ఆసియా కప్ సాధించి  ప్రపంచకప్ కు సగర్వంగా ఎంట్రీ ఇవ్వాలని శ్రీలంక ఆశపడుతున్నది. ఒకరకంగా లంకకు ఇది క్రికెట్ లో అస్తిత్వ పోరాటం. ఈ పోరాటంలో లంక చివరి మెట్టు మీద ఉంది. ఇక్కడ గెలిచి మునపటి ప్రదర్శనలను రిపీట్ చేస్తుందా..? లేక మళ్లీ చతికిలపడుతుందా...? అనేది  త్వరలోనే తేలనున్నది. 

click me!