అప్పుడు వార్నర్ వర్సెస్ కేన్ విలియంసన్... ఇప్పుడు విజయ్ శంకర్ వర్సెస్ మనీశ్ పాండే... ఫైనల్స్‌లో సన్‌రైజర్స్..

First Published Nov 20, 2021, 6:39 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లు కేన్ విలియంసన్, డేవిడ్ వార్నర్ ప్రత్యర్థులుగా పోటీపడగా, ఇప్పుడు దేశవాళీ టోర్నీ  సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్లేయర్లు మనీశ్ పాండే, విజయ్ శంకర్ ప్రత్యర్థులుగా పోటీ పడనున్నారు... 

విజయ్ శంకర్, మనీశ్ పాండే... ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ఆణిముత్యాలు. ఈ ఇద్దరూ సరిగా ఆడి ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించిన మ్యాచుల కంటే, ఈజీగా గెలిచే మ్యాచులను తమ చెత్త ఆటతో ఓడగొట్టిన మ్యాచులే ఎక్కువ. 

ముఖ్యంగా ‘త్రీడీ ప్లేయర్’ విజయ్ శంకర్ అంటే తెలుగువారికి ప్రత్యేకమైన అభిమానం. అవసరమైతే పది వేలు ఎదురిచ్చి అయినా ఆ విజయ్ శంకర్‌ను వదిలించుకోవాలని ఆరెంజ్ ఆర్మీని వేడుకుంటూనే ఉన్నారు అభిమానులు. 

అయితే ఐపీఎల్ వేలంలో ఛాయ్, బిస్కెట్లు తినడానికి తప్ప, కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఏ మాత్రం ఫోకస్ పెట్టని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్... విజయ్ శంకర్‌కి మాత్రం ఏటా రూ.3.20 కోట్లు, సీనియర్ మోస్ట్ ఇండియన్ ప్లేయర్ అనే ట్యాగ్ మోయడానికి తప్ప, జట్టుకి పెద్దగా ఉపయోగపడని మనీశ్ పాండేకి అయితే ఏకంగా రూ.11 కోట్లు చెల్లిస్తోంది...


ఐపీఎల్‌లో పెద్దగా సక్సెస్ కాకపోయినా దేశవాళీ టోర్నీల్లో ఈ ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. ఈసారి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో కర్ణాటక జట్టును మనీశ్ పాండే నడిపిస్తుంటే, తమిళనాడు టీమ్‌కి విజయ్ శంకర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు జట్లు, సోమవారం ఫైనల్ మ్యాచ్‌లో తలబడబోతున్నాయి...


హైదరాబాద్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, 18.3 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తనయ్ త్యాగరాజన్ 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు మినహా, హైదరాబాద్ ప్లేయర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు...

తమిళనాడు బౌలర్ శరవణ కుమార్ 3.3 ఓవర్లలో రెండు మెయిడిన్లతో 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన తమిళనాడు, ఫైనల్‌కి దూసుకెళ్లింది. జగదీశన్ 1 పరుగు, హరి నిశాంత్ 14 పరుగులు చేసి అవుటైనా సాయి సుదర్శన్ 34, విజయ్ శంకర్ 43 పరుగులు చేసి తమిళనాడుకి విజయాన్ని అందించారు...

రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ జట్టుపై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది కర్ణాటక. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది...

రోహన్ కదమ్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేయగా, మనీశ్ పాండే 42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి మెరుపులు మెరిపంచాడు...

ఇన్నింగ్స్‌లో 20వ ఓవర్ వేసిన దర్శన్ నల్కండే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదుచేశాడు. టీ20ల్లో అభిమన్యు మిథున్ 2019లో తర్వాత నాలుగు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు దర్శన్...

177 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ, 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులకి పరిమితమైంది. అధర్వ తాడే 32, గణేశ్ సతీశ్ 31, శుభమ్ దూబే 24, అపూర్వ వాఖండే 27 పరుగులతో రాణించినా ఆఖర్లో విజయానికి కావాల్సిన 14 పరుగులు చేయలేకపోయింది విదర్భ.

20వ ఓవర్ వేసిన విద్యాధర్ పాటిల్, మొదటి బంతికే అక్షయ్ కర్నేశ్వర్‌ని అవుట్ చేయగా, ఆ తర్వాత ఐదు బంతుల్లో 9 పరుగులు మాత్రమే వచ్చాయి. 

2019 సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీకి మనీశ్ పాండే కెప్టెన్సీలోని కర్ణాటక సొంతం చేసుకోగా, కరోనా కారణంగా ఈ ఏడాది జనవరిలో జరిగిన 2020 సీజన్‌లో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో తమిళనాడు టీమ్ టైటిల్ గెలవడం విశేషం. 

click me!