గంగూలీ మ్యాచ్ అయ్యాక ఫోన్ చేసి ఛాయ్ పెట్టమనేవాడు... ఆశీష్ నెహ్రా కామెంట్స్...

First Published Nov 6, 2021, 6:48 PM IST

మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చి, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్, ఎమ్మెస్ ధోనీ,  విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన ఒకే ఒక్క ప్లేయర్ ఆశీష్ నెహ్రా. 1999లో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చి, 2017 వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగినప్పటికీ ఆశీష్ నెహ్రా క్రికెట్ కెరీర్‌ను గాయాలు తెగ ఇబ్బందిపెట్టాయి.  

వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు తరుపున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్ ఆశీష్ నెహ్రా. 2003 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులకే 6 వికెట్లు తీసి, అదరగొట్టాడు నెహ్రా... 

ఇప్పటికీ ఐసీసీ వరల్డ్‌ కప్ టోర్నీలో భారత జట్టు తరుపున ఇదే అత్యుత్తమ ప్రదర్శన. తన కెరీర్‌లో 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20 మ్యాచులు ఆడిన నెహ్రా, 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు...

‘నేను టెస్టు క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్నాను. అయితే గాయాల కారణంగా ఎక్కువ టెస్టులు ఆడలేకపోయాను. నా క్రికెట్ కెరీర్ చిన్నదే అయినా నాకు సంతృప్తినిచ్చింది...

సౌరవ్ గంగూలీ నుంచి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా కూల్‌గా ఉండేవాడు. అప్పుడు నేను ఒక్కడినే సౌరవ్ దాదా ప్రవర్తనతో బాగా అప్‌సెట్ అయ్యేవాడిని...

నా కోపాన్ని క్రీజులోనే చూపించేవాడిని. కానీ గంగూలీ మాత్రం అప్పుడు ఏమీ అనేవాడు కాదు. చాలా కూల్‌గా ఉండేవాడు. మ్యాచ్ అయిపోయాక సాయంత్రం ఫోన్ చేసినా... ‘అరే అసు... ఏం చేస్తున్నావ్... నా రూమ్‌కి రా...’ అని పిలిచేవాడు...

రూమ్‌కి వెళ్లగానే ఓ ఛాయ్ పెట్టి ఇవ్వమని అడిగేవాడు. క్రికెట్ గ్రౌండ్‌లో ఏం జరిగినా, అది అక్కడి వరకే పరిమితం కావాలని దాదా నమ్మేవాడు. ఓ జట్టును ఎలా నడిపించాలో సౌరవ్ దాదా బాగా తెలుసు...

ప్రతీ ప్లేయర్ నుంచి ఏం ఆశిస్తున్నాడో, క్లియర్‌గా చెప్పేవాడు. ఇది చేయాల్సిందేనని పట్టుబట్టేవాడు. అదే నాలాంటి కొందరు ప్లేయర్లకు దాదాపై కోపం వచ్చేది...

కానీ సౌరవ్ గంగూలీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అందుకే ఆ కోపాన్ని ఎలా పొగొట్టాలో కూడా దాదాకు బాగా తెలుసు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆశీష్ నెహ్రా...

2011 వన్డే వరల్డ్‌ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఆశీష్ నెహ్రా, తన కెరీర్‌లో 11 తీవ్రమైన గాయాలతో సతమతమయ్యాడు. ఈ కారణంగానే జట్టులోకి వస్తూ పోతుండేవాడు నెహ్రా...

‘నా శరీరానికి గాయాలు కాదు, గాయాల మధ్యలోనే నా శరీరం ఉన్నట్టుగా నాకు అనిపించేది. అయితే నా క్రికెట్ కెరీర్ నాకు సంతృప్తినిచ్చింది. ఎందుకంటే కెరీర్ అంటే అందరూ వికెట్లు, మ్యాచులు, పరుగులు చూస్తారు...

నా విషయంలో మాత్రం నా ఆటే నాకు ముఖ్యం. నేను ఆడిన ప్రతీ మ్యాచ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఆడాను.. నాకు అదే సంతృప్తి...’ అంటూ కామెంట్ చేశాడు ఆశీష్ నెహ్రా...  

click me!