T20 Worldcup 2021: క్రిస్ గేల్ రిటైర్మెంట్!... ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం ‘యూనివర్సల్ బాస్’...

First Published Nov 6, 2021, 4:53 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న వెస్టిండీస్... టోర్నీలో పెద్దగా రాణించలేకపోయిన క్రిస్ గేల్... ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ ప్రచారం...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మొదలెట్టింది వెస్టిండీస్. ఇప్పటికే రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్, ఈసారి కూడా టైటిల్ ఫెవరెట్‌గా టోర్నీని మొదలెట్టింది. 

 అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 55 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని చవిచూసిన వెస్టిండీస్, ఆ తర్వాత సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచుల్లోనూ ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది...

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం అందుకున్న వెస్టిండీస్‌ జట్టుకి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్‌గా మారింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఆస్ట్రేలియాకి మాత్రం ఈ మ్యాచ్ విజయం అత్యంత ఆవశ్యకం. 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగే సూపర్ 12 రౌండ్ మ్యాచ్, వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో, ఆ తర్వాతి ఏడాది మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు...

టీ20 క్రికెట్‌లో లెజెండరీ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న డీజే బ్రావో, ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడి ఆ జట్టు టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు..

బ్రావోతో పాటు క్రిస్ గేల్‌కి కూడా ఇదే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి 2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలోనే క్రిస్ గేల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది...

అయితే ఇప్పట్లో ఆ ఆలోచన లేదని, అవసరమైతే మరో ఐదేళ్లు ఆడతానని కామెంట్ చేశాడు క్రిస్ గేల్. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ చేసిన కొన్ని పనులు, ఇదే అతని ఆఖరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని సూచనలు ఇస్తున్నాయి...

హెల్మెట్ లోపల కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్ గేల్‌, క్రీజులోకి అడుగుపెట్టేందుకు ముందు విండీస్ ప్లేయర్లు లేచి నిలబడి చప్పట్లతో అతన్ని సాగనంపారు...

9 బంతుల్లో 15 పరుగులు చేసి అవుటైన క్రిస్ గేల్, డగౌట్‌లోకి వచ్చిన తర్వాత హెల్మెట్ తీసి, బ్యాట్‌తో అభిమానులకు అభివాదం చేశాడు. అంతేకాకుండా తన గ్లవ్స్‌ని అభిమానులకు అందించాడు...

టీ20 క్రికెట్‌లో అసాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన క్రిస్ గేల్, పొట్టి ఫార్మాట్‌ ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్  చేసేవాడు. బ్యాటుతోనే కాకుండా బంతితో వికెట్ తీసినా, క్యాచ్ పట్టినా గేల్ సెలబ్రేట్ చేసుకునే స్టైల్, విండీస్‌తో పాటు యావత్ క్రికెట్ ప్రపంచానికి ఎంతగానో నచ్చేది.

‘యూనివర్సల్ బాస్’గా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్, టీ20ల్లో 22 సెంచరీలతో 14,306 పరుగులు చేశాడు... 145.4 స్ట్రైయిక్ రేటుతో 36.44 సగటుతో టీ20ల్లో 87 హాఫ్ సెంచరీలు చేసిన క్రిస్ గేల్, ఓవరాల్‌గా 445 ఇన్నింగ్స్‌ల్లో 22 సెంచరీలు సాధించాడు. ఇందులో ఆర్సీబీ తరుపున చేసిన 175 నాటౌట్‌ గేల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు..

42 ఏళ్ల క్రిస్ గేల్, ఐపీఎల్‌తో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ క్రికెట్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్ వంటి అన్ని టోర్నీల్లోనూ ఆడాడు. ఐపీఎల్‌లో 140 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్, 4950 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

click me!