ఇండియా ఫైనల్‌కి రావాలి, మరోసారి మీరో మేమో తేల్చుకుందాం... షోయబ్ అక్తర్ కామెంట్స్...

First Published Oct 28, 2021, 4:06 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి ఆశించిన ఆరంభం మాత్రం దక్కలేదు. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటివరకూ ఓడిపోయి పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడింది టీమిండియా. దీంతో భారత జట్టు సెమీస్ అవకాశాలన్నీ ఈ ఆదివారం జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్టుపైనే ఆధారపడి ఉన్నాయి...

న్యూజిలాండ్‌తో మ్యాచ్ గెలిస్తే, టీమిండియా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. లేదా మూడు మ్యాచులు మిగిలి ఉన్నా, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే అవుతుంది...

టీమిండియాకి న్యూజిలాండ్‌పై ఏ మాత్రం సరైన రికార్డు లేదు. ఐసీసీ టోర్నీల్లో చివరిసారిగా 2003 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో న్యూజిలాండ్‌ను ఓడించింది టీమిండియా. ఆ తర్వాత 18 ఏళ్లుగా కివీస్‌పై విజయాన్ని అందుకోలేకపోయింది...

2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన భారత జట్టు, 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే...

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ ముగిసినా భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు ‘ఎలాగో ఓడిపోతారు, మాకు వాకోవర్ ఇచ్చేయండి’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్..

అయితే షోయబ్ అక్తర్ మాత్రం... ‘అక్టోబర్ 24 రోజు సాయంత్రం భారత్‌లోని 1.5 బిలియన్ల భారతీయుల గుండెలను బ్రేక్ చేస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు. ఆ మాటలను తిరిగి పోస్టు చేసి, భజ్జీకి గుర్తు చేశాడు అక్తర్...

దానికి హర్భజన్... ‘పండగ చేసుకోండి. టైం మారడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. త్వరలోనే దీనికి ఘనమైన ముగింపు అందుతుంది...’ అంటూ రిప్లై ఇచ్చాడు హర్భజన్ సింగ్...

దీనికి సమాధానంగా... ‘ఇండియా ఫైనల్‌కి రావాలని కోరుకుంటున్నా బ్రదర్... నీకు తెలుసా ఫైనల్‌కి ముందు కాస్త మస్తీ ఉండడం తప్పనిసరి...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...

2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ జట్లు రెండుసార్లు తలబడ్డాయి. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్తాన్‌పై ‘బాల్ అవుట్’ ద్వారా విజయాన్ని అందుకున్న టీమిండియా, ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ అందుకుంది...

వరుసగా రెండు విజయాలు అందుకున్న పాకిస్తాన్, సెమీస్ చేరడం దాదాపు ఖాయమే. పాక్ మిగిలిన మ్యాచుల్లో ఆఫ్ఘాన్, నమీబియా, స్కాట్లాండ్‌లను ఓడిస్తే సరిపోతుంది... టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరుతుంది.

అదే టీమిండియా ఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్‌ను ఓడించి, ఆ తర్వాత ఆఫ్ఘాన్, స్కాట్లాండ్, నమీబియాలతో తలబడాల్సి ఉంటుంది. ఆఫ్ఘాన్ సంచలన విజయాలు అందుకుంటే తప్ప న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్ చేరనుంది. 

click me!