ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా విరాట్ కోహ్లీ, ఆ ఇద్దరి కంటే బెస్ట్ కెప్టెన్... సునీల్ గవాస్కర్ కామెంట్స్...

First Published Nov 8, 2021, 3:19 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు, నమీబియాతో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రికి, భారత టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే ఆఖరి మ్యాచ్ కానుంది... నమీబియాతో జరిగే మ్యాచ్ టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి 50వ మ్యాచ్ కూడా...

ఇప్పటిదాకా కెప్టెన్‌గా 49 టీ20 మ్యాచుల్లో 30 విజయాలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో మూడు ఫార్మాట్లలోనూ 30+ విజయాలు అందుకున్న ఏకైక, మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ..

కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినప్పటికీ, ఇప్పటిదాకా ఒకే ఒక్క టీ20 సిరీస్ మాత్రమే కోల్పోయాడు విరాట్ కోహ్లీ...  ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ మినహాయిస్తే వరుసగా 11 టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్నాడు విరాట్...

Latest Videos


భారత జట్టు ఓడిన ఆఖరి రెండు టీ20 సిరీస్‌లు కూడా ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ కాగా, మరోటి గత జూలైలో శ్రీలంక టూర్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడిన టీ20 సిరీస్. కరోనా కారణంగా ప్రధాన ప్లేయర్లు మిస్ కావడంతో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో ఓడింది టీమిండియా...

‘ఐసీసీ టైటిల్ గెలవకపోయినా విరాట్ కోహ్లీ టీమిండియాకి దక్కిన బెస్ట్ కెప్టెన్లలో ఒకడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఇంతకుముందు ఎరుగని విజయాలను అందుకుంది...

ఎమ్మెస్ ధోనీ, సౌరవ్ గంగూలీ వంటి మిగిలిన కెప్టెన్ల కంటే విరాట్ కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు ఎక్కువ విజయాలు అందుకుంది. అందులో ఎలాంటి సందేహం లేదు...

కెప్టెన్‌గానూ మిగిలిన కెప్టెన్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతనో అద్భుతమైన కెప్టెన్ అని చెప్పడానికి ఇవి సరిపోవా... ఐసీసీ టైటిల్ గెలిచినా, గెలవకపోయినా విరాట్ ఓ గొప్ప కెప్టెన్..’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలలో టీ20 సిరీస్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్ కూడా విరాట్ కోహ్లీయే.. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో 9 ఏళ్ల పాటు టీ20 సిరీస్‌లు ఆడిన భారత జట్టు, స్వదేశంలో సిరీస్‌లు అందుకున్నా, విదేశాల్లో చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయింది...

టీ20 కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్, ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తర్వాతి స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆరోన్ ఫించ్ 1719 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 1570 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు...

కెప్టెన్‌గా 2008లో ఐసీసీ అండర్19 వరల్డ్‌కప్ గెలిచిన విరాట్ కోహ్లీ, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు...

2014, 2016 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీల్లో ఒంటి చేత్తో భారత బ్యాటింగ్ భారాన్ని మోసి, టీమిండియాను ఫైనల్స్‌కి, సెమీ ఫైనల్స్‌కి చేర్చాడు విరాట్ కోహ్లీ... 

కెప్టెన్‌కి ధోనీకి విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ లాంటి ప్లేయర్లు దొరికినట్టు, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఏ ప్లేయర్ అండగా నిలవకపోవడంతో పాటు దురదృష్టం వెంటాడడం కూడా అతని కెప్టెన్సీ వైఫల్యానికి కారణంగా చెబుతున్నారు అభిమానులు...

click me!