T20 World cup: సారథిగా తన చివరిగేమ్ లో కోహ్లి అలా చేస్తే హుందాగా ఉంటుంది : సంజయ్ మంజ్రేకర్

First Published Nov 8, 2021, 2:56 PM IST

India vs Namibia: టీ20 క్రికెట్ లో కొత్త ట్రెండ్ సృష్టించాలనుకుంటే..  నేడు నమీబియాతో జరిగే మ్యాచ్ లో కోహ్లి ఒక పని చేయాలని భారత మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.

టీమిండియా సారథి  విరాట్ కోహ్లి నేటితో  భారత టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా సోమవారం సాయంత్రం నమీబియాతో జరిగే మ్యాచ్..  పొట్టి ఫార్మాట్ లో సారథిగా విరాట్ కు ఆఖరి మ్యాచ్. 

అయితే ఈ మ్యాచ్ లోనే విరాట్.. సారథ్య బాధ్యతలు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (ఊహాగానాలు) కు అప్పజెప్పాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. అలా చేస్తే కోహ్లి కొత్త సంప్రదాయానికి నాంది పలికినట్టు అవుతుందని చెప్పాడు. ఇదే విషయమై అతడు మాట్లాడుతూ.. ‘టీ20 క్రికెట్ లో విరాట్  కొత్త ట్రెండ్ సృష్టించాలనుకుంటే  నేడు నమీబియాతో మ్యాచ్ లో కోహ్లి ఒక పని చేయాలి. ఈ మ్యాచ్ లోనే అతడు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాలి..’ అని అన్నాడు. 

ఒకవేళ కోహ్లి గనుక అలా చేస్తే.. రోహిత్ శర్మ ఆటగాడిగా విశ్రాంతి తీసుకోడని అన్నాడు. రాబోయే న్యూజిలాండ్ సిరీస్ లో అతడు కెప్టెన్ గా కొనసాగుతాడని తెలిపాడు.

ఈనెల 17 నుంచి ఇండియా-న్యూజిలాండ్ మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్ లు ఆడాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్ కు విరాట్ తో పాటు.. రోహిత్ కు కూడా విశ్రాంతినివ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ  కోహ్లి..  నమీబియాతో మ్యాచ్ లో రోహిత్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పితే  హిట్ మ్యాన్ ఆ సిరీస్ ఆడతాడని మంజ్రేకర్ అన్నాడు. 

ఇక కోహ్లి తో పాటు టీమిండియా  హెడ్ కోచ్ రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరు మ్యాచ్. 2017 నుంచి కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతడి పదవికాలంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు. 

యూఏఈ ప్రపంచకప్ వారిద్దరికీ (విరాట్, రవిశాస్త్రి) ఒక బ్యాడ్ మెమోరీ గా మిగిలిపోతుందని చోప్రా అన్నాడు. చోప్రా మాట్లాడుతూ.. ‘ఒక కథకు ఎక్కడైనా ముగింపు పడాల్సిందే. విరాట్ కోహ్లికి కెప్టెన్ గా ఇదే చివరి ప్రపంచకప్.ఇకపై అతడు భారత్ తరఫున టీ20లలో సారథిగా వ్యవహరించే అవకాశం రాకపోవచ్చు. విరాట్ తో పాటు శాస్త్రి కూడా తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాడు. అయితే ఈ టోర్నీ ఇద్దరినీ నిరాశపరిచింది’ అని అన్నాడు. 

శాస్త్రి గురించి స్పందిస్తూ.. ‘ఇకపై రవిశాస్త్రిని టీమిండియా కోచ్ గా చూసే అవకాశం లేదు. అయితే ఆయన ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేకపోవడం లోటే. శాస్త్రి నేతృత్వంలో భారత జట్టు... మూడు ఐసీసీ టోర్నీలలో పాల్గొంది. అయితే ఈ మూడింటిలో ఓటమి పాలయ్యింది. బహుశా ఇది అతడి మనసులో ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది’ అని చోప్రా అన్నాడు.

click me!