అక్కడ హీరో, ఇక్కడ విలన్... టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అంటే వారికి ఎందుకు పడదు...

First Published Nov 4, 2021, 7:21 PM IST

ప్రపంచం మొత్తానికి నవంబర్ 4 దీపావళి అయితే, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా పండగ వస్తుంది. ఎందుకంటే రన్ మెషిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నవంబర్ 5.  టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో టీ20 కెప్టెన్‌గా వైదొలగబోతున్న విరాట్ కోహ్లీ, 33వ ఒడిలో అడుగుపెట్టబోతున్నాడు...

విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 163 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నుంచి ఎందరో నేటితరం క్రికెటర్లు విరాట్ కోహ్లీ ఆటకి వీరాభిమానులు..

స్కాట్లాండ్ కెప్టెన్ కేల్ కోర్టెజ్, విరాట్ కోహ్లీని ఒక్కసారి తమ టీమ్ డ్రెస్సింగ్‌ రూమ్‌కి ఆహ్వానించాలని కోరబోతున్నట్టు కామెంట్ చేశాడంటే... టీమిండియా కెప్టెన్‌కి వరల్డ్ క్రికెట్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు...

వన్డే, టెస్టు, టీ20ల్లో 30+ విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధోనీకి కూడా సాధ్యంకాని విదేశీ టెస్టు విజయాలను విరాట్ అందించాడు...

దశాబ్ద కాలంలో 20వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.

ప్రపంచం మొత్తాన్ని గెలిచిన రాజు, ఇంట్లో ఓడిపోయినట్టుగా... క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిన విరాట్ కోహ్లీకి స్వదేశంలో మాత్రం అభిమానుల కంటే హేటర్స్ ఎక్కువ...

2008లో అండర్‌-19 వరల్డ్‌కప్ గెలిచిన యువ భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీకి వెంటనే టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. దాంతో 2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ...

కేవలం 8 లిస్టు-ఏ మ్యాచులు మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీని భారత జట్టుకి ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... అయితే భారత ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ గాయపడడంతో మరో ఛాయిస్ లేక యంగ్ ఓపెనర్‌గా విరాట్ కోహ్లీకి అవకాశం దక్కింది...

19 ఏళ్ల వయసులో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ, తన తొలి మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే అదే సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న కోహ్లీ, భారత జట్టుకి వన్డే సిరీస్ దక్కడంలో కీ రోల్ పోషించాడు.

అయితే ఆ సిరీస్ తర్వాత మళ్లీ విరాట్ కోహ్లీకి జట్టులో చోటు దూరమైంది. అయితే ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడడంతో 2009లో ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ తరుపున ఆడాడు విరాట్ కోహ్లీ. ఆ మ్యాచ్‌లో 49 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు విరాట్‌.. 

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరుపున ఆడిన మ్యాచ్‌లో 105 పరుగులు చేసి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. బ్రెట్‌లీ, స్టువర్ట్ క్లార్క్, మిచెల్ జాన్సన్ వంటి ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ చేసిన విరాట్‌కి టీమిండియా నుంచి మరోసారి పిలుపు వచ్చింది...

శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గౌతమ్ గంభీర్ గాయపడడం, 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్ సింగ్ గాయపడడంతో వారి స్థానాల్లో తుదిజట్టులో చోటు దక్కించుకున్న విరాట్ కోహ్లీ... వచ్చిన అవకాశాలను అద్భుతంగా వాడుకుని, జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 

2009 ఛాంపియన్స్ ట్రోఫీలో విండీస్‌పై79 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు కోహ్లీ... శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో గౌతమ్ గంభీర్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 111 బంతుల్లో 107 పరుగులు చేసి తొలి వన్డే సెంచరీ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన గంభీర్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కితే, దాన్ని కోహ్లీకి అందించాడు గౌతీ...

ఆ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీకి మళ్లీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు... విండీస్ టూర్‌లో ధోనీ గాయపడడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ, సారథిగా తన రెండో వన్డేలోనే సెంచరీతో చెలరేగాడు...

జింబాబ్వే టూర్‌లో ఐదు వన్డేలను క్లీన్‌స్వీప్ చేసి... భారత్‌కి మొట్టమొదటి విదేశీ క్లీన్‌స్వీప్ వన్డే విజయాన్ని అందించాడు. ఇదే జట్టులోని సీనియర్లను కాదని, విరాట్ కోహ్లీకి టీమిండియా కెప్టెన్సీ దక్కడానికి కారణమైంది...

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్, జో రూట్ వంటి ప్లేయర్లు టెస్టుల్లో, డేవిడ్ వార్నర్, బట్లర్, ఆరోన్ ఫించ్, బాబర్ ఆజమ్ వంటి ప్లేయర్లు వన్డే, టీ20 ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తుంటే... విరాట్ కోహ్లీ ఒక్కడే ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లలోనూ రికార్డుల మోత మోగించాడు...

టెస్టుల్లో 27 సెంచరీలు, వన్డేల్లో 43 సెంచరీలతో 70 అంతర్జాతీయ శతకాలు అందుకున్న విరాట్ కోహ్లీ, ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్, ఫాలోయింగ్ అందుకున్నాడు. అయితే ఎన్ని విజయాలు అందిస్తున్నా, మనదేశంలో విరాట్ కోహ్లీకి అభిమానుల కంటే విమర్శకులు ఎక్కువ...

దీనికి కారణం ముఖ్యంగా మూడు... మొదటిది విరాట్ కోహ్లీ అగ్రెసివ్ యాటిట్యూడ్... క్రికెటర్‌గా స్టార్‌గా ఎదిగినా ఆవేశంలో కంట్రోల్ చేసుకోలేని యువకుడిగా సీనియర్ సిటిజన్స్‌లో ఓ విధమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు విరాట్...

అదీకాకుండా భారత మాజీ కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోనీ, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మల కంటే ఎక్కువ పరుగులు చేస్తూ వారిని మించిన స్టార్‌డమ్ తెచ్చుకోవడం... ధోనీ, రోహిత్‌లకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. విరాట్ చూపించిన నిలకడ, సంపాదించిన క్రేజ్ ఈ ఇద్దరు క్రికెటర్ల అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ వారికి విరాట్ ఓ అన్‌మెచ్యూర్డ్ క్రికెటర్‌గానే మిగిలాడు. 

అదీకాకుండా తనకంటే ముందే జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మకు కెప్టెన్సీ దక్కకుండా విరాట్ కోహ్లీ అడ్డుగా నిలిచాడని, ‘హిట్ మ్యాన్’ ఫ్యాన్స్ టీమిండియా కెప్టెన్‌పై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్‌కి టీ20 కెప్టెన్సీ ఇవ్వాలనేది వారి వాదన.


ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా... నేటితరంలో విరాట్ కోహ్లీ ఓ మోడ్రన్ లెజెండ్. ఇప్పటికే అతను భారత జట్టుకి ఎంతో చేశాడు. కొన్నాళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నా... భారత జట్టులో తన అగ్రెషన్‌ను నింపడంలో 100% సక్సెస్ అయ్యాడు...

click me!