కివీస్ ఓడితే, వాళ్లను ఆపడం మా వల్ల కాదు... పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్

First Published Nov 6, 2021, 3:10 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆఫ్ఘాన్, స్కాట్లాండ్‌లపై భారీ విజయాలు అందుకున్న భారత జట్టు ఆశలన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌పైనే పెట్టుకుంది...

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ ఇరగదీసి 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదుచేసింది...

పసికూన స్కాట్లాండ్ జట్టును 85 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, ఆ లక్ష్యాన్ని 6.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ జెట్ స్పీడ్ ఛేజింగ్ కారణంగా నెట్ రన్‌రేట్‌ మెరుగుపర్చుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది టీమిండియా...

అయితే భారత జట్టు సెమీస్ చేరాలంటే ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫలితం కీలకం కానుంది. పసికూన ఆఫ్గాన్, న్యూజిలాండ్‌పై ఎలాగైనా విజయం సాధిస్తేనే... భారత జట్టుకి సెమీస్ చేరే అవకాశాలు ఉంటాయి...

న్యూజిలాండ్‌పై ఆఫ్ఘాన్ విజయం సాధిస్తే... న్యూజిలాండ్, ఆఫ్ఘాన్, టీమిండియా (నమీబియాపై విజయం సాధిస్తే) జట్లు ఆరేసి పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా సాధించే విజయం మార్జిన్, ప్లేఆఫ్స్ బెర్తును కన్ఫార్మ్ చేస్తుంది...

‘ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే చాలా అనుమానాలు రేగుతాయి. చాలామందికి న్యూజిలాండ్‌తో పాటు ఆఫ్ఘాన్, ఐసీసీ, బీసీసీఐ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది...

కచ్ఛితంగా న్యూజిలాండ్ ఓడిపోతే మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నేను వివాదాలు లేకుండా టోర్నీ ముగియాలని అనుకుంటున్నా. ఒకవేళ న్యూజిలాండ్ ఓడిపోతే, పాకిస్తాన్ జనాలు వారిని ఏ మాత్రం వదిలిపెట్టరు...

ఎందుకంటే న్యూజిలాండ్, ఆఫ్ఘాన్ కంటే చాలా మంచి టీమ్. వారికి చాలా అనుభవం ఉంది. ఎన్నో టోర్నీలు గెలిచారు. డబ్ల్యూటీసీ టైటిల్ కూడా గెలిచారు. కాబట్టి వారికి ఆఫ్ఘాన్‌ని ఓడించడం పెద్ద కష్టమేమీ కాకపోవదు..

కానీ న్యూజిలాండ్ ఓడిపోతే సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రజలు సృష్టించే రచ్చను ఆపడం మా వల్ల కాదు. భారత జట్టు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ పోటీలో ఉండడం చాలా మంచి పరిణామం...

ఇండియా ప్లేఆఫ్స్ చేరితే, టోర్నీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి చూసే అవకాశం దొరుకుతుంది. అదే జరిగితే క్రికెట్‌కి, కుర్రాళ్లకీ మంచి జరుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్..

ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయం అందుకున్న తర్వాత ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారంటూ ఆరోపిస్తూ, సోషల్ మీడియాలో ‘ఫిక్సింగ్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు పాక్ జనాలు... ఈసారి కూడా అలాగే జరుగుతుందని అంటున్నాడు అక్తర్...

click me!