ఆ రెండు జట్లకీ ఛాన్సే లేదు, ఈ సారి టైటిల్ కొట్టేది వీళ్లే... భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప జోస్యం...

First Published Nov 11, 2021, 3:29 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగిన జట్లన్నీ ఇంటికి చేరిపోయాయి. టైటిల్ గెలుస్తారని భావించిన డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు టీమిండియా సూపర్ 12 స్టేజ్‌ వరకే పరిమితం కాగా, ఇంగ్లాండ్ టీమ్ సెమీఫైనల్‌లో ఓడింది...

ఆఖరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మొదటి సెమీఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో మొట్టమొదటిసారి ఫైనల్‌కి అర్హత సాధించింది...

అలాగే పెద్దగా అంచనాలు లేకుండా టోర్నీని ప్రారంభించిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు రెండో సెమీ ఫైనల్‌లో తలబడబోతున్నాయి.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలబడుతుంది...

పాకిస్తాన్ జట్టు 2007 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో ఓడి, రన్నరప్‌గా నిలిచినా ఆ తర్వాతి ఎడిషన్ 2009లో టీ20 వరల్డ్‌కప్ గెలిచింది... 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మాత్రం ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయాయి. ఆస్ట్రేలియా 2010 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది...

‘ఈసారి పాకిస్తాన్ మంచి ఫామ్‌లో ఉంది. ఆ టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు కూడా పుష్కలంగా ఉన్నారు. నా అంచనా ప్రకారం ఈసారి పాకిస్తాన్ టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నా...

రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ ఈజీగా గెలుస్తుందని అనుకుంటున్నా. పాకిస్తాన్‌ యూఏఈలో వరుసగా 16 టీ20 మ్యాచులు గెలిచింది...

అయితే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ చేతుల్లో ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో ఓడింది లేదు. అయితే ఈ రెండు రికార్డుల్లో ఒక్కటి రెండో సెమీ ఫైనల్‌లో బ్రేక్ కావడం గ్యారెంటీ... 

అయితే ఆస్ట్రేలియాని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈసారి వాళ్లు టీ20 వరల్డ్‌కప్ లేని లోటు తీర్చుకోవాలనే కసితో ఆడుతున్నట్టు కనిపిస్తోంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత సీనియర్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప...

2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రాబిన్ ఊతప్ప... ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడి, టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు...

సూపర్ 12 రౌండ్‌లో ఐదు విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా నిలిచిన పాకిస్తాన్, 29 ఏళ్ల తర్వాత ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుపై విజయాన్ని అందుకుంది...

అలాగే సూపర్ 12 రౌండ్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత మిగిలిన అన్ని జట్లనూ ఓడించి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది... 

click me!