ఆఖరికి ఆస్ట్రేలియా విజయంలో కూడా ధోనీ హస్తం... మాహీ మానియా మామూలుగా ఉండదు మరి...

First Published Nov 15, 2021, 3:46 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలిసారి ఫైనల్‌కి అర్హత సాధించిన న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి, మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సొంతం చేసుకుంది. ఆసీస్ విజయంలో కూడా భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హస్తం ఉందట...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌ను యూఏఈలోనే నిర్వహించింది బీసీసీఐ. ఈ రెండు మెగా టోర్నీల మధ్య సరైన టైమ్ గ్యాప్ లేకపోవడం టీమిండియా పర్ఫామెన్స్‌ను దెబ్బతీసిందని విమర్శలు వచ్చాయి...

అయితే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు ఐపీఎల్ ఆడడం వల్ల తమకు మేలు జరిగిందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ కామెంట్ చేశాడు. ట్రెంట్ బౌల్డ్ అండ్ కో పర్ఫామెన్స్‌కి ఐపీఎల్ కారణమైందని అన్నాడు...

ఇవన్నీ పక్కనబెడితే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్‌వుడ్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభానికి ముందు అసలు జోష్ హజల్‌వుడ్‌ని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలనే ఆలోచన కూడా ఆస్ట్రేలియాకి లేదట. అతను ముందు బంగ్లాదేశ్, వెస్టిండీస్ టూర్లలో హజల్‌వుడ్ ఫెయిల్ కావడంతో హజల్‌వుడ్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేయాలని భావించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

అయితే ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున బరిలో దిగిన జోష్ హజల్‌వుడ్, టోర్నీలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. 9 మ్యాచుల్లో 11 వికెట్టు తీసి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు...

యూఏఈ పిచ్‌లపై హజల్‌వుడ్ జోష్‌ఫుల్ బౌలింగ్‌ని చూసిన క్రికెట్ ఆస్ట్రేలియా, అతని విషయంలో నిర్ణయం మార్చుకుంది. హజల్‌వుడ్, ఆస్ట్రేలియాకి మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు...

‘అవును, జోష్ హజల్‌వుడ్ మా బౌలింగ్ విభాగంలో కీలకంగా మారాడు. సీఎస్‌కేతో అతను ఆడిన అనుభవం, మాకు ఎంతగానో ఉపయోగపడింది. వికెట్లు రావాలంటే ఎలాంటి బంతులు వేయాలో పక్కాగా తెలుసుకున్నాడు...

ఐపీఎల్ ద్వారా అతను గ్రహించిన అనుభవాన్ని మాతో డ్రెస్సింగ్ రూమ్‌లో పంచుకున్నాడు. ఐపీఎల్‌లో అతని పర్పామెన్స్ కారణంగానే కేన్ రిచర్డ్‌సన్‌ని పక్కనబెట్టి, హజల్‌వుడ్‌కి ప్లేస్ ఇచ్చాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్...

ఇండియాలో కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్ నుంచి తప్పుకున్న జోష్ హజల్‌వుడ్, సెకండ్ హాఫ్‌లో మాత్రం టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఉండడంతో ఆడడానికి ముందుకొచ్చాడు.

ఇలా జోష్ హజల్‌వుడ్‌కి కలిసి వచ్చిన మాహీ మ్యాజిక్, భారత బౌలర్లు శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాల విషయంలో ఎందుకు కలిసి రాలేదో కదా అని బాధపడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం ఏకంగా మెంటర్‌గా బరిలో దిగిన ఎమ్మెస్ ధోనీ, వార్మప్ మ్యాచుల్లో తెగ సందడి చేశాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో మనోళ్ల పర్ఫామెన్స్ మొత్తం మాహీ మహిమే అంటూ తెగ ఊదరగొట్టారు కామెంటేటర్లు...

అయితే ఉట్టి ఉట్టి మ్యాచుల్లో కనిపించిన మాహీ మహిమ, పాకిస్తాన్, న్యూజిలాండ్‌‌లతో జరిగిన మ్యాచుల్లో మాత్రం కలిసి రాలేదు. ఈ రెండు టీముల్లో సీఎస్‌కే ప్లేయర్లు ఎవ్వరూ లేరు. లేదంటే భారత జట్టుపై వాళ్లు గెలవడానికి కూడా మాహీయే కారణమనేవాళ్లు అంటూ కామెంట్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

click me!