ఆ ప్లేయర్ అంటే చాలా ఇష్టం, కానీ అతను టీ20 వరల్డ్‌కప్‌కి కరెక్ట్ కాదు... షేన్ వార్న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

First Published Nov 1, 2021, 11:06 PM IST

T20 Worldcup 2021: వరుసగా రెండు విజయాలతో టీ20 వరల్డ్‌కప్ టోర్నీని ప్రారంభించిన ఆసీస్... ఇంగ్లాండ్ చేతుల్లో ఓటమి, ఆసీస్ వ్యూహాలు, టీమ్ సెలక్షన్‌పై షేన్ వార్న్ అసంతృప్తి... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగింది ఆస్ట్రేలియా. వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆసీస్‌కి ఘనమైన చరిత్ర ఉన్నా, టీ20ల్లో మాత్రం వారికి చెప్పుకోదగ్గ గణాంకాలు లేవు. 2010లో ఫైనల్‌లో ఓడిన ఆసీస్, ఆ తర్వాత సెమీ ఫైనల్ కూడా దాటలేకపోయింది.

అయితే ఈసారి ఏ మాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆరంభించిన ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచుల్లో మంచి విజయాలు అందుకుంది. అయితే ఇంగ్లాండ్ జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌కి పరాభవం ఎదురైంది.

ఈ మ్యాచ్‌లో ఐదు బంతులాడిన స్టీవ్ స్మిత్, ఒకే ఒక్క పరుగు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. గత 15 టీ20 ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ సింగిల్ డిజిట్ స్కోరుకి అవుట్ కావడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, స్టీవ్ స్మిత్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

‘ఆస్ట్రేలియా టీమ్ సెలక్షన్ నన్ను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌ని పక్కనబెట్టి, మ్యాక్స్‌వెల్‌ను పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసేలా చేశారు. ఫ్రీగా షాట్స్ ఆడగల మ్యాక్స్‌వెల్ పవర్ ప్లే తర్వాత వస్తే బాగుంటుంది. 

అవసరమైతే స్టోయినిస్‌ని పక్కనబెట్టాల్సింది. ఇది వరల్డ్‌కప్ గెలవడానికి కావాల్సిన స్ట్రాటెజీ మాత్రం కాదు... టీమ్ సెలక్షన్‌లోనే కాదు, వ్యూహరచనలోనూ ఆసీస్ విఫలమైంది. 

నాకు స్టీవ్ స్మిత్ అంటే చాలా ఇష్టం, ప్రేమ కూడా. అయితే అతను టీ20 టీమ్‌కి కరెక్ట్ కాదు, అదీ టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఆడించడం కరెక్ట్ కాదు. అతని బదులు మిచెల్ మార్ష్ ఉండాల్సింది.. 

ఇంగ్లాండ్ జట్టు మాత్రం టీ20ల్లో ఎలా ఆడాలో అలా ఆడుతోంది. ఇంగ్లాండ్ జట్టును చూసి, మూడు నాలుగు వికెట్లు పడిన తర్వాత కూడా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో ఆస్ట్రేలియా నేర్చుకోవాలి. 

ఇంగ్లాండ్‌తో పాటు పాకిస్తాన్ జట్టు కూడా టీ20లను ఎలా ఆడాలో చూపిస్తోంది. ఆస్ట్రేలియా ఇప్పటికైనా వారి ఆటతీరును, జట్టును మార్చుకుని పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడం నేర్చుకుంటే చాలా బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్...

వాస్తవానికి కొన్నాళ్ల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న స్టీవ్ స్మిత్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి దూరంగా ఉండాలని భావించాడు. ఈ నెలలో జరిగే యాషెస్ టెస్టు సిరీస్ కోసం ఫిట్‌గా ఉండేందుకు అవసరమైతే టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీకి దూరంగా ఉంటానని కామెంట్ చేశాడు.

అయితే స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ వంటి కీ ప్లేయర్లు లేకుండా వెస్టిండీస్ పర్యటనలో, బంగ్లాదేశ్ పర్యటనలో టీ20 సిరీస్‌లను కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. అయితే మిచెల్ మార్ష్ మాత్రం ఈ టూర్‌ల్లో ఆసీస్ తరుపున అద్భుతంగా రాణించి ఒంటరి పోరాటం చేశాడు.

దీంతో టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీ ఆడాలని భావించిన స్టీవ్ స్మిత్, అందుకు సన్నాహకంగా ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లోనూ పాల్గొన్నాడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన స్టీవ్ స్మిత్‌ను, ఈ ఏడాది వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 

గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరుపున 14 మ్యాచులు ఆడి 311 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, ఈ ఏడాది 8 మ్యాచులు మాత్రమే ఆడగలిగాడు. సెకండ్ ఫేజ్‌లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే స్మిత్‌కి అవకాశం దక్కింది. మొత్తంగా 152 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, వచ్చే ఏడాది మెగా వేలంలో ఏ జట్టుకి వెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది.

click me!