టీమిండియా సెమీస్‌కి వెళ్లదని, బీసీసీఐకి ముందే తెలుసా... అందుకే ఫైనల్ తర్వాత...

First Published Nov 7, 2021, 4:33 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ప్లేఆఫ్స్ ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. సూపర్ 12 రౌండ్‌లో ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత పసికూన జట్లైన ఆఫ్ఘాన్, స్కాట్లాండ్‌లపై తన ప్రతాపాన్ని చూపించింది...

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌‌ను 66 పరుగుల తేడాతో, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌‌ను 6.3 ఓవర్లలోనే ముగించినా... అవి భారత జట్టును ప్లేఆఫ్స్ చేర్చడానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు... 

భారత జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే పసికూన ఆఫ్ఘాన్, పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించాలని ఆశలు పెట్టుకుంది... అయితే కివీస్, ఆఫ్ఘాన్‌కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు... అనుభవం లేని ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు న్యూజిలాండ్ బౌలర్లు...

అయితే టీమిండియా షెడ్యూల్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్‌కి ఓ కొత్త అనుమానం రేగుతోంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20, టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది భారత జట్టు...

సాధారణంగా అయితే ఐసీసీ టోర్నీల షెడ్యూల్ విడుదలైతే, దానికి తగ్గట్టుగా ద్వైపాక్షిక సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేస్తారు. అయితే బీసీసీఐ షెడ్యూల్ చూస్తే మాత్రం మనోళ్లు, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ప్లేఆఫ్స్ చేరతారనే నమ్మకం కూడా లేనట్టు రూపొందించినట్టే ఉంది...

షెడ్యూల్ ప్రకారం నవంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు రోజులకే న్యూజిలాండ్, ఇండియా మధ్య జైపూర్‌లో తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది...

టీ20 జట్టు అంటే విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చినా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా వంటి ప్లేయర్లు ఉండాల్సిందే. వీళ్లు కూడా లేకుంటే న్యూజిలాండ్‌ జట్టును ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుంది...

ప్రస్తుతం యూఏఈలో ఉన్న వీళ్లు, భారత జట్టు ప్లేఆఫ్స్, ఫైనల్ చేరుకుంటే నవంబర్ 14 వరకూ యూఏఈలోనే ఉంటారు. ఆ తర్వాతి రోజు బయలుదేరి వచ్చినా, ఒక్క రోజు గ్యాప్‌లో  సరైన విశ్రాంతి కూడా లేకుండానే టీ20 సిరీస్ ఆడాల్సి ఉంటుంది...

ఇవన్నీ తెలిసి కూడా ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు రోజులకే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ షెడ్యూల్ చేశారంటే, భారత జట్టు ఫైనల్ చేరుతుందనే నమ్మకం బీసీసీఐ పెద్దలే లేనట్టు ఉందని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

న్యూజిలాండ్ జట్టు కూడా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడుతున్న జట్టుతోనే టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం అందుకుంటే, కివీస్ ప్లేఆఫ్స్ చేరడం గ్యారెంటీ...  

గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉండే న్యూజిలాండ్, గ్రూప్ 1లో టేబుల్ టాపర్‌గా ఉన్న ఇంగ్లాండ్‌తో, గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో గ్రూప్ 2 టాపర్ పాకిస్తాన్ మ్యాచులు ఆడబోతున్నాయి... 

ఒకవేళ న్యూజిలాండ్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఫైనల్ చేరితే... వారికి కూడా ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్లేఆఫ్స్ నుంచి నిష్కమిస్తే మాత్రం కనీసం ఆరు రోజుల గ్యాప్ దొరుకుతుంది...

వాస్తవానికి ఇదే నెలలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది భారత జట్టు. వన్డే మ్యాచులు, వన్డే వరల్డ్‌కప్ పాయింట్ల కోసం వన్డే సిరీస్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టెస్టులు నిర్వహించాల్సింది.

అయితే బిజీ షెడ్యూల్ కారణంగా మూడు వన్డేల సిరీస్‌ను వచ్చే ఏడాది అక్టోబర్‌కి వాయిదా వేశాయి బీసీసీఐ, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు. నవంబర్ 17 నుంచి మొదలయ్యే ఇండియా టూర్‌లో న్యూజిలాండ్ మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడనుంది. 

click me!