T20 World Cup: ఎవరెన్ని చెప్పినా సరే.. ఇది స్పిన్నర్ల ప్రపంచకప్.. ఐపీఎల్లో కనిపించలేదా..? రషీద్ ఖాన్ కామెంట్స్

First Published Oct 20, 2021, 4:59 PM IST

Rashid Khan: యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ స్పిన్నర్లకు స్వర్గధామమని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అన్నాడు. పిచ్ లను ఎలా తయారుచేసినా తాము వికెట్లు తీస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున బౌలింగ్ లో అదరగొడుతున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ నిస్సందేహంగా స్పిన్నర్ల వరల్డ్ కప్ అని కుండబద్దలు కొట్టాడు. 

యూఏఈ వంటి స్లో పిచ్ ల మీద స్పిన్నర్లు బాగా ప్రభావం చూపిస్తారని రషీద్ చెప్పాడు. ప్రపంచకప్ జరుగుతున్న మూడు వేదికలు.. (అబుదాబి, దుబాయ్, షార్జా) లు స్పిన్ కు స్వర్గధామంగా ఉంటాయని స్పష్టం చేశాడు. 

రషీద్ ఖాన్ మాట్లాడుతూ... ‘ఇక్కడి (యూఏఈ) పరిస్థితులు కచ్చితంగా స్పిన్నర్లు అనుకూలంగా ఉంటాయి. ఇది స్పిన్నర్ల వరల్డ్ కప్’ అని అన్నాడు. 

ఇంకా అతడు మాట్లాడుతూ.. ‘పిచ్ లను ఎలా తయారుచేసినా స్పిన్నర్లకు ఇబ్బంది లేదు. అవి ఎప్పుడూ స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. ఈ ప్రపంచకప్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఐపీఎల్ లో మనం చూశాం.  ప్రతి జట్టులో స్పిన్నర్లు ప్రభావం చూపించాడరు. అలాగే ఈ ప్రపంచకప్ లో కూడా అవే ఫలితాలు రిపీట్ అవుతాయి. అత్యుత్తమ స్పిన్నర్లు  వారి జట్టు విజయాల వెనుక ఉంటారు’ అని వివరించాడు.

ఇక తమ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘మేం గ్రూప్-2 లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ తో కలిసి ఉన్నాం. మేం సూపర్-12 దశ దాటాలంటే చాలా కష్టపడాలని మాకు తెలుసు.  మా జట్టు బ్యాటింగ్ లో మంచి స్కోరు సాధిస్తే బౌలర్లుగా మా పని సులువవుతుంది. ఒకవేళ మేం బ్యాటింగ్ లో మెరిస్తే ప్రత్యర్థి ఎవరైనా మా ముందు తలవంచాల్సిందే’ అని అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా అఫ్ఘాన్ 14 టీ20 లు ఆడగా.. ఆడిన అన్ని మ్యాచ్ లలో గెలవడం విశేషం. 

ఆధునిక  క్రికెట్ లో తాను చూసిన ఆరుగురు స్పిన్నర్ల గురించి రషీద్ ఖాన్ వివరించాడు. ఈ ఆరుగురి స్పిన్ చూడటం తనకెంతో ముచ్చటేస్తుందని చెప్పాడు. వీరిలో ఇద్దరు భారత స్పిన్నర్లు ఉండటం విశేషం. 

రషీద్ చెప్పిన జాబితాలో.. భారత్ నుంచి యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ ఉన్నారు. మిగిలిన నలుగురు షాదాబ్ ఖాన్, ఇష్ సోధి, ఆడమ్ జంపా, ఇమ్రాన్ తాహిర్. కాగా, భారత్ నుంచి రషీద్ ఖాన్ ఎంచుకున్న చాహల్,  రవి లలో ఒక్కరు కూడా ప్రస్తుతం భారత్ ఆడుతున్న టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యులు కాకపోవడం గమనార్హం. 

భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి బౌలింగ్ వేయడం చాలా కష్టమని రషీద్ ఖాన్ చెప్పాడు. ఏదైనా తప్పులు చేస్తే  బౌలర్లపై విరాట్ విరుచుకుపడటం ఖాయమని అతడు  తెలిపాడు. సూపర్-12 లో భాగంగా భారత్ నవంబర్ 3న భారత్.. అఫ్ఘనిస్థాన్ తో తలపడుతున్నది. 
 

click me!