కెప్టెన్‌ని మారిస్తే వరల్డ్ కప్ వస్తదంటిరి... బీసీసీఐ, రోహిత్ శర్మలపై ఆగని ట్రోల్స్...

First Published | Nov 11, 2022, 9:38 AM IST

ఫ్రాంఛైజీ క్రికెట్‌కీ, ఇంటర్నేషనల్ క్రికెట్‌కి చాలా తేడా ఉంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన చాలామంది ప్లేయర్లు, అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం ఇస్తే రాణించలేకపోయారు. వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్... ఇలా లిస్టులో చాలా పెద్దగానే ఉంది. అయితే ఎంఎస్ ధోనీ, నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడం వల్లేనేమో... టీమిండియాకి రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా చేయాలనే వాదన బలంగా వినిపించింది...

ఎంఎస్ ధోనీ తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా... ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది...

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీకి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 9 సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్, 2016లో టీమ్‌ని ఫైనల్ చేర్చినా టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ అదరగొట్టాడు...
 


Image credit: PTI

2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచాడు. 8 సీజన్లలో 5 సార్లు ముంబై ఇండియన్స్ జట్టును ఛాంపియన్‌గా నిలిచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు...


ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డు కారణంగా విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్సీ రికార్డును చిన్నచూపు చూశారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. సునీల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు మాత్రమే కాదు... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా కూడా ఇదే రకమైన అభిప్రాయం వెల్లడించారు.ఐపీఎల్‌లో టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ చాలా మంచి కెప్టెన్ అని ఫిక్స్ అయ్యి, కెప్టెన్సీ మార్చారు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ భావించినా.. వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పించి, ఘోరంగా అవమానించింది బీసీసీఐ. ఆ తర్వాత కొన్ని రోజులకే టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు విరాట్ కోహ్లీ...

రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అందించిన తర్వాత టీమిండియా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ద్వైపాక్షిక సిరీసుల్లో టీమిండియా ఘన విజయాలు అందుకుంది. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం ఖాయమని ఫిక్స్ అయ్యారంతా...

Rohit Sharma

అయితే ఆసియా కప్ 2022 టోర్నీలోనే రోహిత్ సేనకి తొలి షాక్ తగిలింది. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ టీమిండియా సెమీ ఫైనల్‌ నుంచే ఇంటిదారి పట్టింది. దీంతో కెప్టెన్‌ని మారిస్తే, వరల్డ్ కప్ గెలుస్తారని చెప్పిన బీసీసీఐపై విమర్శల వర్షం కురుస్తోంది...

Image credit: PTI

లోపం కెప్టెన్‌లోనో, కెప్టెన్సీలోనో లేదని... టీమ్ యాటిట్యూడ్‌లో ఉందనే విషయం భారత క్రికెట్ బోర్డుకి ఇప్పటికైనా అర్థమై ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్‌లో టైటిల్ గెలవని కారణంగా టీమిండియా కెప్టెన్‌గా పనికి రావని ఎన్నో నిందలు మోసిన విరాట్ కోహ్లీపై ఇన్నాళ్లకు సానుభూతి చూపిస్తున్నారు అభిమానులు... 

Latest Videos

click me!