ఆ నలుగురు తప్ప అందరూ ఫెయిల్... టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో మనోళ్ల పర్ఫామెన్స్‌కి...

First Published | Nov 11, 2022, 11:28 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా కథ సెమీస్‌లోనే ముగిసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలుస్తుందని భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడి ఇంటిదారి పట్టింది. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా తరుపున ఆడిన ప్లేయర్లలో నలుగురు తప్ప, మిగిలిన అందరూ ఫెయిల్ అయ్యారు...

Image credit: Getty

విరాట్ కోహ్లీ: ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు విరాట్ కోహ్లీకి, టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు ఇవ్వడమే దండగ అనే టాక్ వినిపించింది. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో  6 మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 296 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని ఒంటి చేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీ, బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు... సెమీస్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి, టీమిండియా 160+ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ..

సూర్యకుమార్ యాదవ్: టీమిండియా తరుపున సూర్యకుమార్ యాదవ్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. 6 మ్యాచుల్లో 239 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 189.68 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు... అయితే సెమీస్‌లో సూర్య ఫెయిల్యూర్, టీమిండియా ఓటమికి కారణమైంది.

Latest Videos


Arshdeep Singh

అర్ష్‌దీప్ సింగ్: 6 మ్యాచుల్లో 10 వికెట్లు తీసి, టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు అర్ష్‌దీప్ సింగ్. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి సీనియర్ల కంటే మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్, చాలా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించాడు...

హార్ధిక్ పాండ్యా: టీమిండియా తరుపున ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు హార్ధిక్ పాండ్యా. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీతో కలిసి అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన హార్ధిక్ పాండ్యా, సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో పవర్ చూపించాడు. బౌలింగ్‌లోనూ 8 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా... మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...

రవిచంద్రన్ అశ్విన్: టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. అయితే పాక్‌తో మ్యాచ్‌లో ఆఖర్లో సమయోచితంగా వ్యవహరించి భారత జట్టుకి విజయాన్ని అందించిన అశ్విన్, ఈ టోర్నీలో పర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో 6 వికెట్లు తీసిన అశ్విన్, బ్యాటింగ్‌లో రెండు మ్యాచుల్లో మెరుపులు మెరిపించాడు...

Image credit: PTI

రోహిత్ శర్మ: కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో 4, సౌతాఫ్రికాపై 15, బంగ్లాదేశ్‌పై 2, జింబాబ్వేపై 15 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నెదర్లాండ్స్‌‌పై 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే సెమీ పైనల్‌లో 28 బంతులు ఆడిన రోహిత్, 27 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. పవర్ ప్లేలో రోహిత్ శర్మ జిడ్డు బ్యాటింగ్‌ టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది.

Rohit-Rahul

కెఎల్ రాహుల్: పాకిస్తాన్‌పై 4, నెదర్లాండ్స్‌పై 9, సౌతాఫ్రికాపై 9 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో 5 పరుగులకే అవుటైన రాహుల్, టీమిండియాని పీకల్లోతు కష్టాల్లో పడేసి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు... 

భువనేశ్వర్ కుమార్: జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్‌కి దూరం కావడంతో సీనియర్ పేసర్ భువీపైనే భారీ ఆశలు పెట్టుకుంది టీమిండియా. అయితే గ్రూప్ స్టేజీల్లో 10 ఓవర్లకు పైగా డాట్ బాల్స్ వేసి మెప్పించిన భువీ, వికెట్లు మాత్రం తీయలేకపోయాడు. సెమీ ఫైనల్‌లో తొలి ఓవర్‌లో 3 ఫోర్లు ఇచ్చి, మిగిలిన బౌలర్లను ఒత్తిడిలోకి పడేశాడు భువీ. భువీ ఫెయిల్యూర్ టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది.

మహ్మద్ షమీ: బుమ్రా లాస్ట్ మినెట్‌లో టోర్నీ నుంచి తప్పుకోవడంతో మహ్మద్ షమీకి టీ20ల్లో చోటు దక్కింది. ఏడాది తర్వాత నేరుగా టీ20 వరల్డ్ కప్‌లోనే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు షమీ. టోర్నీలో షమీ ఉన్నా, లేనట్టే అనిపించింది. మొత్తంగా 6 మ్యాచుల్లో 6 వికెట్లు తీసిన షమీ, టీమిండియా పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు.

అక్షర్ పటేల్: రవీంద్ర జడేజా గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో అతను లేని లోటు తీరుస్తాడని అక్షర్ పటేల్‌పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది టీమిండియా. అయితే జడ్డూలా బ్యాటింగ్ చేయలేక, తనలా బౌలింగ్ చేయలేక టోర్నీలో ఫ్లాప్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు అక్షర్ పటేల్... 

Image credit: PTI

దినేశ్ కార్తీక్: ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు దినేశ్ కార్తీక్. మ్యాచ్ ఫినిషర్‌గా కొన్ని గేమ్‌ల్లో టీమిండియాని గెలిపించి, వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్‌లో నాలుగు మ్యాచుల్లో కలిసి ఒక్క సిక్సర్ బాదలేకపోయాడు దినేశ్ కార్తీక్... 

Image credit: Getty

రిషబ్ పంత్: దినేశ్ కార్తీక్‌కి సబ్‌స్టిట్యూట్‌గా రిషబ్ పంత్‌ని టీ20 వరల్డ్ కప్‌కి సెలక్ట్ చేసినట్టుంది టీమిండియా. అందుకే మొదటి నాలుగు మ్యాచుల్లో రిషబ్ పంత్ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. వచ్చిన రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు రిషబ్ పంత్. పంత్‌, టీ20లకు పనికి రాడనో లేక ఫామ్‌లో లేడనో కానీ అతన్ని సరిగ్గా వాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు టీమిండియా...

Image credit: Getty

మొత్తంగా టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా... నలుగురు మాత్రమే సూపర్ హిట్ పర్ఫామెన్స్ ఇస్తే... రవిచంద్రన్ అశ్విన్ పర్వాలేదనిపించాడు. మిగిలిన ప్లేయర్లలో ఒక్కరూ కూడా ఆశించినట్టుగా రాణించలేక టీమిండియా ఓటమికి కారణమయ్యారు... 
 

click me!