టీమిండియా మిస్ చేసుకున్న ‘గూగ్లీ’ స్పిన్నర్... ఎవరీ కార్తీక్ మెయ్యప్పన్...

First Published | Oct 18, 2022, 4:07 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా 2022 వరల్డ్ కప్ ఆడుతున్న యూఏఈ ప్లేయర్ కార్తీక్ మెయ్యప్పన్, ఆసియా కప్ 2022 టోర్నీ విజేత శ్రీలంకపై హ్యాట్రిక్ నమోదు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి యూఏఈ ప్లేయర్‌గా రికార్డులు క్రియేట్ చేశాడు కార్తీక్ మెయ్యప్పన్..

Image credit: Getty

యూఏఈ తరుపున ఆడుతున్న వారిలో చాలామంది ఇండియా, పాకిస్తాన్ దేశానికి చెందినవాళ్లే. ఇక్కడి నుంచి బతుకు తెరువు కోసం ఏడారి దేశాలకు వెళ్లిన భారతీయ కుటుంబాల సంఖ్య వేలల్లో, లక్షల్లో ఉంటుంది. అలా 2012లో యూఏఈకి వలస వెళ్లింది కార్తీక్ మెయ్యప్పన్ ఫ్యామిలీ...

Karthik Meiyappan

తమిళనాడు రాజధాని చెన్నైలో అక్టోబర్ 8, 2000వ సంవత్సరంలో జన్మించిన కార్తీక్ మెయ్యప్పన్, చిన్నతనంలో ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం అబుదాబికి వలస వెళ్లింది. అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లి సెటిల్ అయ్యారు మెయ్యప్పన్ ఫ్యామిలీ...


2019 అండర్ 19 ఏసియా కప్ టోర్నీలో యూఏఈ అండర్ 19 క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ కార్తీక్ పలనిఅప్పన్ మెయ్యప్పన్. అంతకుముందు 2018 ఆసియా కప్‌లోనూ పాల్గొన్న మెయ్యప్పన్, 2019లో యూఏఈ తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు...

యునైటెడ్ స్టేట్స్‌తో మొట్టమొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన కార్తీక్ మెయ్యప్పన్, 2020 అండర్ 19 వరల్డ్ కప్ టీమ్‌కి సెలక్ట్ అయ్యాడు. అదే ఏడాది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు కార్తీక్...

2021 సమ్మర్ టీ20 బాష్ టోర్నీకి ఎంపికైన కార్తీక్ మెయ్యప్పన్, ఐర్లాండ్‌పై టీ20 ఆరంగ్రేటం చేశాడు. అందులో చూపించిన పర్ఫామెన్స్‌తో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జట్టులో కార్తీక్‌కి అవకాశం దక్కింది. 

నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన కార్తీక్ మెయ్యప్పన్, శ్రీలంక జట్టుపై హ్యాట్రిక్ తీశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఓ టెస్టు టీమ్‌పై హ్యాట్రిక్ నమోదు చేసిన మొట్టమొదటి అసోసియేట్ క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు కార్తీక్ మెయ్యప్పన్...

శ్రీలంక బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో చక్కగా బ్యాటింగ్ చేయగలరు. ముత్తయ్య మురళీధరన్, రంగనా హేరాత్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను ప్రపంచానికి పరిచయం చేసింది శ్రీలంక. అలాంటి లంకపై ఓ స్పిన్ బౌలర్ హ్యాట్రిక్ తీయడమంటే సాధారణ విషయం కాదు. తన గూగ్లీలతో లంక ప్రధాన బ్యాటర్లు భనుక రాజపక్ష, చరిత్ అసలంక, లంక కెప్టెన్ ధస్సున్ శనక‌లను అవుట్ చేశాడు మెయ్యప్పన్. 

ఓవరాల్‌గా టీ20 వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు కార్తీక్ మెయ్యప్పన్. 2007 టీ20 వరల్డ్ కప్‌లో బ్రెట్ లీ, బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ తీయగా గత ఏడాది మూడు హ్యాట్రిక్స్ నమోదయ్యాయి. నెదర్లాండ్‌పై కుర్టీస్ కాంపర్, సౌతాఫ్రికాపై వానిందు హసరంగ, ఇంగ్లాండ్‌పై కగిసో రబాడా హ్యాట్రిక్స్ తీశారు. 

Karthik Meiyappan

ఈ చెన్నై చిన్నోడు, యూఏఈకి వలస వెళ్లకపోయి ఉంటే ఈపాటికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరుపున ఆడేవాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇక్కడే ఉండి ఉంటే కార్తీక్ మెయ్యప్పన్ అనే ప్లేయర్, ఐపీఎల్‌లో కనిపించడానికి కూడా కష్టమైపోయేదని, కాంపిటీషన్, రాజకీయాలు ఆ స్థాయిలో ఉన్నాయని ట్రోల్స్ చేస్తున్నారు. 

Latest Videos

click me!