Suryakumar Yadav: సూర్య భాయా మాజాకా.. ఐసీసీ ర్యాకింగ్స్‌లో టాప్-2కు చేరిక.. బాబర్ అగ్రస్థానానికి ఎసరు..?

First Published Aug 3, 2022, 3:26 PM IST

ICC Rankings: టీమిండియా నయా ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ వెస్టిండీస్ తో మూడో టీ20తో పాటు ఐసీసీ ర్యాంకులలోనూ దుమ్మురేపాడు.  ఇక అతడి నెక్స్ట్ టార్గెట్ బాబర్ ఆజమ్ అగ్రస్థానమే.. 

ఐసీసీ పురుషుల క్రికెట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత మరో భారత బ్యాటర్ అగ్ర పీఠాన్ని అధిరోహించబోతున్నాడు. ఇటీవల కాలంలో ‘మిస్టర్ 360’గా గుర్తింపుపొందుతున్న సూర్యకుమార్ యాదవ్.. తాజాగా  ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరాడు.  

కొద్దిరోజుల క్రితం ఇంగ్లాండ్ తో ముగిసిన టీ20 సిరీస్ లో సెంచరీతో పాటు తాజాగా వెస్టిండీస్ తో పొట్టి ఫార్మాట్ లో కూడా రాణిస్తున్న సూర్య.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఐసీసీ  టీ20  ర్యాంకుల (బ్యాటింగ్)లో టాప్-2కు చేరాడు. 

వెస్టిండీస్ తో మూడో టీ20కి ముందు నాలుగో స్థానంలో ఉన్న సూర్య.. తాజాగా 816 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. మూడో టీ20లో సూర్య.. 44 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో అతడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నాడు. 

Babar Azam

అగ్రస్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు. అయితే బాబర్ ఆజమ్ కు సూర్యకు మధ్య తేడా 2 రేటింగ్ పాయింట్లు మాత్రమే కావడం గమనార్హం. సూర్యకు 816 పాయింట్లు ఉండగా.. బాబర్ ఆజమ్.. 818 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక విండీస్ తో రాబోయే రెండు టీ20లలో కూడా సూర్య ఇదే ఊపును కొనసాగిస్తే అతడు అగ్రస్థానానికి చేరడం పెద్ద కష్టమేమీ కాదు. 

ఇక ఈ జాబితాలో  పాకిస్తాన్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ 794 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ నాలుగో స్థానంలో నిలిచాడు.  ఈ లిస్ట్ లో సూర్య మినహా మిగిలిన ఏ భారత బ్యాటర్ కూడా టాప్-10లో లేరు.  సూర్య తర్వాత  ఇషాన్ కిషన్ 14వ స్థానంలో ఉండగా.. రోహితా్ శర్మ 16వ స్థానంలో కొనసాగుతున్నారు. 

టీ20 లో బౌలర్ల ర్యాంకింగ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హెజిల్వుడ్  792 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంషీ, రషీద్ ఖాన్, అదిల్ రషీద్, అకీల్ హోసిన్, వనిందు హసరంగలు ఉన్నారు. వీరిలో  హెజిల్వుడ్ మినహా మిగిలినవారంతా స్పిన్నర్లే కావడం విశేషం. 

ఈ జాబితాలో భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్.. 653 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు.  యుజ్వేంద్ర చాహల్ 20వ స్థానంలో ఉన్నాడు. 
 

click me!