సూర్యా భాయ్ ఆన్ ది వే.. ఐసీసీ ర్యాంకుల్లో రెండో స్థానానికి చేరిన మిస్టర్ 360.. ఇక మిగిలింది అతడొక్కడే..

First Published Sep 28, 2022, 4:23 PM IST

Suryakumar Yadav: టీ20లలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం కోసం  పోటీపడుతున్న అతడు అందుకు ఒక అడుగు దూరంలో నిలిచాడు. 

పొట్టి క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న టీమిండియా బ్యాటర్ల జాబితా తీస్తే అందులో  సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో ఉంటాడు.  గడిచిన ఏడాదికాలంగా ఈ నయా ‘మిస్టర్ 360’ప్రత్యర్థి ఎవరనేది సంబంధం లేకుండా మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నాడు. ఫలితంగా ర్యాంకులు కూడా అతడి జోరుకు దాసోహమవుతున్నాయి. 

ఆసియా కప్‌‌తో పాటు స్వదేశంలో ఇటీవల ముగిసిన  ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా రాణించడంతో సూర్యకుమార్.. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగుల్లో  గత వారం కంటే రెండు  స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో సూర్యకుమార్ యాదవ్.. 801  రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.  
 

ఇక ఈ జాబితాలో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్  అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.  తన టీ20 కెరీర్ లో అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న  రిజ్వాన్.. స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఏడు మ్యాచ్ ల సిరీస్ లో రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో అతడు అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం రిజ్వాన్.. 861 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు. 

ఇదే జాబితాలో పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ గత వారం కంటే ఓ ర్యాంకు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరాడు.  బాబర్..799 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. సూర్య, బాబర్ మధ్య ఉన్న పాయింట్ల తేడా రెండు మాత్రమే. 

ఇదిలాఉండగా  ఈ ముగ్గురి మధ్య పోటీ రాబోయే  రోజుల్లో కూడా కొనసాగునుంది. సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ లు ఆడనున్నాడు. 

మరోవైపు రిజ్వాన్, బాబర్ లు  ఇంగ్లాండ్ తో కూడా మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.  ఈ సిరీస్ లలో ఎవరు రాణిస్తే వాళ్లు తమ ర్యాంకింగులను మెరుగుపరుచుకుంటారు. టీ20 ప్రపంచకప్  ప్రారంభానికి ముందు ఇది వాళ్లకు మానసికంగా ఉత్సాహాన్నిచ్చిదే..

ఇక ఈ జాబితాలో పై ముగ్గురి తర్వాత నాలుగో స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్.. ఎయిడెన్ మార్క్రమ్  (792 పాయింట్లు) ఉండగా ఐదో స్థానంలో ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ (707) ఉన్నాడు. 

సూర్య కాకుండా టాప్-10లో  మరే భారత బ్యాటర్ కూడా చోటు సంపాదించలేదు.  టీమిండియా సారథి రోహిత్ శర్మ 613 పాయింట్లతో 13వ స్థానంలో ఉండగా.. మాజీ సారథి  విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై హైదరాబాద్ లో ముగిసిన చివరి టీ20లో రాణించడం ద్వారా ఒక ర్యాంకును మెరుగుపరుచుకుని 15వ స్థానంలో ఉన్నాడు. 

click me!