గత కొంతకాలంగా భారత బౌలింగ్ దళంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వరుస మ్యాచ్ లలో విఫలమవుతున్నాడు. సుమారు రెండు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్ కూడా ఇంకా కుదురుకోలేదు.
Image credit: Getty
ఈ నేపథ్యంలో రాబోయే టీ20 ప్రపంచకప్ లో మహ్మద్ షమీ పేరును చేర్చాలని టీమిండియా ఫ్యాన్స్ బీసీసీఐని కోరుతున్నారు. గాయం నుంచి తిరిగొచ్చినా స్టార్ పేసర్ బుమ్రా కూడా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోవాల్సి ఉంది. అయితే ఈ పరిణామాలన్నీ భారత్ కు అనుకూలంగా లేవని.. మరో నిఖార్సైన పేసర్ ను తీసుకుంటేనే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పిచ్ లపై షమీ రాణిస్తాడని.. అతడిని వెంటనే స్టాండ్ బై నుంచి మార్చి ప్రధాన జట్టులోకి తీసుకోవాలని మద్ధతు పెరుగుతున్నది. షమీకి గతంలో అక్కడ ఆడిన అనుభవం కూడా టీమిండియాకు కలిసివస్తుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
టీ20 ప్రపంచకప్ జట్టులో షమీ స్టాండ్ బై గా ఉన్నా అతడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు ఎంపికయ్యాడు. కానీ ఆసీస్ తో సిరీస్ కు ముందు కరోనా బారిన పడ్డాడు. పది రోజులు కావస్తున్నా షమీ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి కూడా అతడు తప్పుకున్నాడు.
అయితే ప్రపంచకప్ లో భారత్ మ్యాచ్ ఆడటానికి ఇంకా సుమారు మూడు వారాల కంటే ఎక్కువే సమయముంది. అదీగాక ఇప్పటికే ప్రపంచకప్ కు జట్టును ప్రకటించిన జట్లు.. తమ టీమ్ లలో మార్పులు చేర్పులు చేయడానికి అక్టోబర్ 9 వరకు గడువుంది. అయితే ఆ తేదీ వరకు సదరు ఆటగాడు ఎటువంటి గాయాలతో లేకుండా పూర్తి ఫిట్నెస్ సాధించి ఉండాలి.
ఈ నిబంధలను పాటిస్తే జట్టులో మార్పులు చేసుకోవచ్చు. అలాకాకుంటే ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా స్టాండ్ బై గా ఉన్న ఆటగాడికి ప్రధాన జట్టులో ఉన్న ఎవరైనా ప్లేయర్ గాయపడితే తప్ప టీమ్ లోకి రావడం కుదరదు.
అలాంటి సందర్భాలలో షమీ జట్టులోకి రావడం కష్టంగా ఉంటుంది. అందుకే అక్టోబర్ 9లోపే షమీని 15 మంది సభ్యులలో చేర్చాలని టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.