ధోని కాదు.. టీమిండియాలో అసలైన ‘మిస్టర్ కూల్’ కెప్టెన్ అతడే.. సన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jun 26, 2023, 4:15 PM IST

భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనిని అందరూ ‘మిస్టర్ కూల్’అంటారు.  ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉండటం.. మ్యాచ్ ఆరంభం నుంచి చివరివరకూ  ప్రశాంతత కోల్పోకపోవడం అతడి సొంతం.  కీలక ఐసీసీ టోర్నీలలో కూడా  ధోని తన  వ్యూహాలతో పాటు ఈ కూల్‌నెస్ తో కూడా  ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశాడు. 

ధోని తర్వాత కోహ్లీ భారత సారథిగా ఉన్నా అతడికి దూకుడు వైఖరే. కానీ కోహ్లీ తప్పుకున్నాక  రోహిత్ శర్మ కూడా ధోని అంత కాకపోయినా  ఫీల్డ్ లో చాలా కూల్ గా ఉంటాడు.   దీంతో అభిమానులు  రోహిత్ కు కూడా మిస్టర్ కూల్ బిరుదు ఇచ్చేశారు.  

అయితే వీరికంటే ముందే భారత జట్టుకు  ‘మిస్టర్ కూల్ కెప్టెన్’ ఉన్నాడని అంటున్నాడు దిగ్గజ క్రికెటర్  సునీల్ గవాస్కర్.  భారత జట్టుకు 1983లో వన్డే వరల్డ్  కప్ అందించిన కపిల్ దేవ్  ను ఆయన అసలైన మిస్టర్ కూల్ అని ప్రశంసించాడు.  

Latest Videos


భారత్ తొలి వన్డే వరల్డ్ కప్ గెలిచి జూన్ 25కు 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా   గవాస్కర్  మాట్లాడుతూ.. ‘టీమిండియాలో అసలైన మిస్టర్ కూల్  కపిల్ దేవ్. 1983లో బంతితోనే గాక బ్యాట్ తో కూడా  కపిల్ దేవ్  రాణించాడు.  అతడి  కెప్టెన్సీ  డైనమిక్ గా ఉండేది.   ఈ ఫార్మాట్ కు ఏదైతే అవసరమో అది చేశాడు.  

మ్యాచ్ లో ఎవరైనా ఫీల్డర్ క్యాచ్ మిస్ చేస్తే వారి వైపు చూసి నవ్వేవాడే తప్ప వారిపై అరవలేదు.   కపిల్ దేవ్ అసలైన కెప్టెన్ కూల్.  ఫైనల్ లో అతడు వివ్ రిచర్డ్స్ క్యాచ్ పట్టిన విధానం చూడండి. అంత ఒత్తిడిలో కూడా  చాలా కూల్ గా ఒడిసిపట్టాడు.  అదీగాక అది రన్నింగ్ క్యాచ్. అది మామూలు విషయం కాదు...’అని   సన్నీ వ్యాఖ్యానించాడు. 

ఇక వరల్డ్  కప్ గెలిచిన తర్వాత ఆ క్షణాలను మాటల్లో చెప్పలేమని.. మా చుట్టూ ఉన్నవాళ్లందరి ముఖాలు  నవ్వులతో వెలిగిపోయాయని, అదేదో టూత్ పేస్ట్ యాడ్ మాదిరిగా  ఆ క్షణాలను భలే ఆస్వాదించామని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.  

click me!