భువీ ఫామ్‌పై గవాస్కర్ ఆందోళన.. అనుభవమున్న నువ్వే ఇలా అయితే ఎలా అంటూ..

First Published Sep 21, 2022, 3:54 PM IST

IND vs AUS: గత నాలుగు మ్యాచ్ లలో భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం  బౌలింగ్. ముఖ్యంగా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్  టీమిండియాకు ఆందోళనకరంగా మారింది. 

Image credit: PTI

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ముగిసిన మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోరు చేసినా దానిని కాపాడుకోవడంలో విఫలమైంది. భారత బౌలర్ల ఫ్లాఫ్ షోతో 208 పరుగులు చేసినా టీమిండియా  ఓడిపోవాల్సి వచ్చింది. టీమిండియా ప్రధాన బౌలర్లైన భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ వంటి బౌలర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. 

Image credit: PTI

ముఖ్యంగా భువీ ఫామ్ పై ఆందోళన నెలకొంది. భారత జట్టుకు  ప్రధాన పేసర్ గా ఉన్న భువనేశ్వర్.. ఆసియా కప్ నుంచి అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు.  ఆ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియాతో తొలి టీ20లో కూడా భువీ ధారాళంగా పరుగలివ్వడమే గాక భారత ఓటమికి ప్రధాన కారణమై తీవ్రంగా నిరాశపరిచాడు. 

తాజాగా ఇదే విషయమై  దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్.. భువీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇండియా-ఆసీస్ మ్యాచ్ ముగిశాక సన్నీ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో మంచు ప్రభావం ఉన్నట్టు కూడా నాకు కనిపించలేదు. ఫీల్డర్లు, బౌలర్లు బంతిని  టవల్ తో తుడిచిన సందర్బాలు కూడా నేను చూడలేదు.  మంచు పేరు చెప్పి ఉపేక్షించడానికి కూడా లేదు. 

మన బౌలర్లు సరిగా బౌలింగ్ చేయలేదు. అదే ఓటమికి ప్రధాన కారణం.  ఉదాహరణకు 19వ ఓవర్లో భారత్ దారుణంగా విఫలమైంది. ఆ ఓవర్ వేసిన భువీ..  16 పరుగులిచ్చాడు. ఒక్క ఈ మ్యాచ్ లోనే కాదు. గత మూడు మ్యాచ్ లలో కూడా  డెత్ ఓవర్లలో భువీ బౌలింగ్ ఆందోళనకరంగా ఉంది .

19వ ఓవర్లో భాగంగా  బౌలింగ్ చేస్తూ భువీ గత 18 బంతుల్లో (పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాపై) 49 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ప్రతి బంతికి దాదాపు మూడు పరుగుల దాకా ఇచ్చినట్టే. ఇది కచ్చితంగా ఆందోళనకరమైన విషయమే. 

భువనేశ్వర్ అనుభవం కలిగిన బౌలర్.  అటువంటివాడు ప్రత్యర్థులను ఇబ్బందుల్లోకి నెట్టాలి గానీ అతడే ఇలా బౌలింగ్ చేస్తే  ఎలా..?’ అని సన్నీ చెప్పాడు. ఇక హర్షల్ పటేల్ పై స్పందిస్తూ.. అతడు గాయం నుంచి కోలుకుని ఇప్పుడే మ్యాచ్ ఆడాడని.. కుదురుకోవడానికి సమయం పడుతుందని సన్నీ తెలిపాడు. 
 

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో భాగంగా భువనేశ్వర్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు. అతడు వేసిన చివరి రెండు ఓవర్లలో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్  వీరవిహారం చేసి మ్యాచ్ ను కంగారూల వైపునకు మళ్లించాడు.  ఇక హర్షల్ పటేల్.. 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరూ ఒక్క వికెట్ కూడా తీయలేదు. 

click me!