
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. మినీ వేలానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల ట్రేడింగ్‌తో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ క్రమంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), తమిళ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు జట్లు ఏకంగా నలుగురు ఆటగాళ్లను పరస్పరం మార్చుకున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకున్న ఆటగాళ్లలో లియామ్ లివింగ్‌స్టన్ ప్రధానమైనవాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలడు. భారీ షాట్లు ఆడటంలో పేరున్న లివింగ్‌స్టన్‌ను గత వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు… అందిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోలేదు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లే ఆడిన అతడు పెద్దగా పరుగులు సాధించలేదు. దీంతో వచ్చే సీజన్ కోసం అతడిని కొనసాగించకూడదని హైదరాబాద్ నిర్ణయించింది. ట్రేడ్‌లో భాగంగా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కేవలం రూ.6 కోట్ల ధరకు తీసుకుంది. అంటే గతంలో చెల్లించిన ధరతో పోలిస్తే లివింగ్‌స్టన్ ఒప్పంద విలువ రూ.7 కోట్లు తగ్గింది.
హైదరాబాద్ టీంకు మరో ఆటగాడు దూరం..
హైదరాబాద్ జట్టు వదులుకున్న మరో ఆటగాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేయకముందే అతడిని సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు ట్రేడ్‌లో భాగంగా ఎడ్వర్డ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు. అతడి ప్రస్తుత ఒప్పంద విలువ రూ.3 కోట్లుగానే కొనసాగనుంది. యువ ఆల్‌రౌండర్‌కు చెన్నై జట్టులో కొత్త అవకాశం లభించనుంది.
ఇక చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆటగాళ్లలో భారత పేసర్ ఖలీల్ అహ్మద్ ఒకరు. ఖలీల్ గతంలో 2018 నుంచి 2021 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఇతర జట్ల తరఫున ఆడిన అతడు ఇప్పుడు మళ్లీ తన పాత ఫ్రాంచైజీలోకి వస్తున్నాడు.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఖలీల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి జట్టు బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026లోనూ చెన్నై తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడినప్పటికీ, గాయం కారణంగా మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు రూ.4.8 కోట్ల ప్రస్తుత ధరతో హైదరాబాద్ జట్టులో చేరాడు.
సిఎస్కే నుండి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన మరో ఆటగాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్. టీ20 క్రికెట్‌లో తన బౌలింగ్ వైవిధ్యాలతో గుర్తింపు తెచ్చుకున్న ఎల్లిస్.. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో మంచి అనుభవం కలిగి ఉన్నాడు. యార్కర్లు, స్లో బంతులు, ఇతర బౌలింగ్ వేరియేషన్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు తీసుకోగా.. ఇప్పుడు అదే ధరకు హైదరాబాద్‌కు బదిలీ చేసింది.
🚨 News 🚨
@ChennaiIPL and @SunRisers have completed a four-player trade ahead of #TATAIPL 2027.
Liam Livingstone (INR 6 Crore, revised fee) and Jack Edwards (INR 3 Crore) move to #CSK, while Khaleel Ahmed (INR 4.8 Crore) and Nathan Ellis (INR 2 Crore) join #SRH.
Details ▶️ https://t.co/wC0HDKvRzJ
— IndianPremierLeague (@IPL) November 5, 2026
ఈ నలుగురు ఆటగాళ్ల మార్పిడితో ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి జట్ల కూర్పుపై ఆసక్తి పెరిగింది. మరోవైపు ఐపిఎల్ జట్లు తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకునే గడువును నవంబర్ 17 వరకు పొడిగించింది బిసిసిఐ. దీంతో ఆ తేదీ లోపు మరిన్ని ట్రేడింగ్ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
ఇక ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. ఈ వేలంలో ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్లను మరింత పటిష్టం చేసుకోనున్నాయి. అప్పటివరకు ఆటగాళ్ల ట్రేడింగ్, రిటెన్షన్ నిర్ణయాలు ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తిని పెంచనున్నాయి.