IPL 2027: ఐపీఎల్ 2027 కి ముందు ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి పలు టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ రేసులో ముఖ్యంగా 3 జట్లు ముందున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా ప్లేస్‌లో కొత్త కెప్టెన్?
ఐపీఎల్ 2027 ట్రేడింగ్ విండో కు సంబంధించి క్రికెట్ సర్కిల్స్‌లో ఒక పెద్ద వార్త హల్‌చల్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజ్ తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను మరొక జట్టుకు ట్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. పాండ్యాను తమ జట్టులో చేర్చుకోవడానికి పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఈ ఆల్ రౌండర్ పై కన్నేశాయి.
ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కి తిరిగొచ్చిన హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే అతడి నాయకత్వంలో ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మూడు సీజన్లలో ఏకంగా రెండు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైంది. దీంతో ముంబై యాజమాన్యం తమ జట్టు బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి హార్దిక్‌ను ట్రేడ్ చేసే ఆప్షన్లను పరిశీలిస్తోంది. గాయాల కారణంగా ఐపీఎల్ 2026 తర్వాత నుంచి హార్దిక్ పాండ్యా కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఐపీఎల్ 2027లో హార్దిక్ పాండ్యా ఆడేందుకు అవకాశం ఉన్న 3 ఫ్రాంచైజీలు ఇవే..
24
పంజాబ్ కింగ్స్ - రేసులో అందరికంటే ముందు
పలు మీడియా రిపోర్ట్స్ ప్రకారం, హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ టీమ్ చర్చలు జరుపుతోంది. ఇరు జట్ల మధ్య డీల్ దాదాపు ముగింపు దశకు వచ్చిందని సమాచారం.
ఈ ప్రతిపాదిత ట్రేడ్ డీల్ ప్రకారం, టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్‌లను ముంబై ఇండియన్స్‌కు పంపి, వారి స్థానంలో హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ దక్కించుకోనుంది. జట్టులో అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ కొరత తీర్చుకోవడానికి పంజాబ్ ఈ ప్లాన్ వేసింది. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతుండటంతో హార్దిక్ పాండ్యా కేవలం ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆ జట్టులో చేరే అవకాశం ఉంది.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ కూడా హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. పాండ్యాను సొంతం చేసుకోవడం కోసం యంగ్ స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌తో పాటు లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను ముంబై ఇండియన్స్‌కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం హార్దిక్ జట్టులోకి వస్తే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చే ఆలోచనలో ఉందనే టాక్ నడుస్తోంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ ఈ డీల్‌లో ముందంజలో ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ వేరే ఫ్రాంచైజీల నుంచి సరైన ఆఫర్ లేదా ఆశించిన ఆటగాళ్లు లభించకపోతే, ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్‌ను తమ వద్దే ఉంచుకునే అవకాశం కూడా ఉంది. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, ప్రస్తుతం తమ బౌలింగ్ ఎటాక్‌ను స్ట్రాంగ్ చేయడానికి వేర్వేరు ట్రేడ్ మార్గాలను వెతుకుతోంది.
ఒకవేళ ఇతర జట్లతో చర్చలు సఫలం కాకపోతే, హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2027 లోనూ ముంబై ఇండియన్స్ తరఫునే బరిలోకి దిగుతాడు. నవంబర్ 17 వరకు ట్రేడింగ్ డెడ్‌లైన్ ఉన్నందున ముంబై యాజమాన్యం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.